తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు అందించేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం సంసిద్ధం అయిన‌ట్లు తెలుస్తోంది. . అంతర్రాష్ట్ర రాకపోకలపై ఉన్న ఆంక్షలను హోం శాఖ ఎత్తివేయడంతో రాష్ట్రాల మధ్య బస్సు సేవలు ప్రారంభం కానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల మ‌ధ్య ఎప్పుడు ఈ సేవ‌లు అందుబాటులోకి వ‌స్తాయ‌నే ఆస‌క్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే తీపిక‌బురు రానుంద‌ని తెలుస్తోంది.

 

తెలంగాణ‌కు పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 400 నుంచి 500 వరకు అంతర్రాష్ట్ర బస్సులు నడుస్తుంటాయి.ఈ రాష్ట్రాల‌లోని నిర్ణీత పట్టణాలకు శని, ఆదివారాల్లో రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రత్యేక బస్సులను నడుపుతుంటారు. తెలంగాణ నుంచి ఎక్కువగా విజయవాడ, బెంగళూరు, శ్రీశైలం, రాయ్‌చూరు, ముంబై, చెన్నైలకు బస్సులు వెళ్తుంటాయి. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఇంద్ర, గురుడ ప్లస్‌ బస్సులు సేవలందిస్తున్నాయి. ఇదే సమయంలో ఆయా రాష్ట్రాల‌ బస్సులు తెలంగాణకు వస్తుంటాయి.

 


లాక్‌డౌన్‌ కారణంగా పలు రాష్ట్రాల‌ ఎంతో మంది చిక్కుకుపోయి ఉన్నారు. ఆర్టీసీ బస్సులు ప్రారంభమైతే రాకపోకలకు మార్గం సుగమవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్‌ మినహా మిగతా జిల్లాల్లో ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు ఇకపై ఇతర రాష్ట్రాల‌కు వెళ్లనున్నాయి. అంతర్రాష్ట్ర రాకపోకలపై ఉన్న ఆంక్షలను హోం శాఖ ఎత్తివేయడంతో రాష్ట్రాల‌ మధ్య బస్సు సేవలు ప్రారంభంకానున్నాయి. కరోనా కేసుల విషయంలో పలు రాష్ట్రాల మ‌ధ్య‌‌‌ తేడాలు ఉండటంతో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఆయా రాష్ట్రాల‌ సమన్వయంతో బస్సులు నడిపించాల్సి ఉంటుందని, ఇతర రాష్ట్రాల‌కు బస్సులు ప్రారంభించాలా వద్దా అనే అంశంపై త్వరలో స్పష్టత రానున్నదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆర్టీసీ ఉన్నత అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ వారంలోనే నిర్ణ‌యం వెలువ‌డ‌నుంద‌ని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: