స‌మాజంలో ఎందరి జీవితాలు బాగుప‌డ్డ‌ప్ప‌టికీ భూమిని న‌మ్ముకున్న రైత‌న్న‌కు ఎల్ల‌ప్ప‌డూ క‌ష్టాలే. ఆరుగాలం శ్ర‌మించిన ఎంతో ఆవేద‌న‌తో ఉండే రైత‌న్న జీవితాలు మార్చేందుకు పాల‌కులు ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నా...ఇంకా ఎన్నో చ‌ర్య‌లు చేయాల్సి ఉంది. కాగా, రైతుల‌కు ఉప‌యోగ‌ప‌డే ఓ కీల‌క నిర్ణ‌యం తాజాగా కేంద్రం తీసుకుంది. అన్న‌దాత‌ల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప్రేమ‌ను ప్ర‌క‌టించుకున్న‌ది. రైతుల పంట‌పై ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర పెంచుతున్నట్టు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ తెలిపారు. కేంద్ర కేబినెట్‌ సమావేశం అనంతరం కేంద్రమంత్రి తోమర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..రైతులకు అండగా నిలిచేందుకు 14 రకాల వానకాలం ‌ పంటలకు రెట్టింపు చేసిన కనీస మద్దతు ధర అమలు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. 

 


రైతులకు రుణాలు చెల్లించేందుకు ఆగస్టు వరకు గడువు పొడిగించినట్లు కేంద్రమంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌  తెలిపారు. కాగా, తాజా చ‌ర్య‌ల‌తో అన్న‌దాత‌ల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం త‌న ప్రేమ‌ను ప్ర‌క‌టించుకుం‌ది. మ‌రోవైపు,  వీధి వ్యాపారుల కోసం రుణ పథకం అమలు చేస్తామని, రుణ పథకం ద్వారా 50 లక్షల మంది వీధి వ్యాపారులకు లబ్ధి చేకూరుతుందని కేంద్రమంత్రి అన్నారు. కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ మాట్లాడుతూ, కేబినెట్‌ భేటీలో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కరోనా మహమ్మారి కారణంగా పేదలు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

 

లాక్‌డౌన్‌ ప్రకటించిన రెండు రోజుల్లోనే రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించడం జరిగింది,  20 కోట్ల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమచేశామని  కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్ పేర్కొన్నారు.  రైతులు, ఎంఎస్‌ఎంఈల విషయమై కేబినెట్‌ భేటీలో నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా 6 కోట్లకుపైగా ఎంఎస్‌ఎంఈలున్నాయని అన్నారు. ఎంఎస్‌ఎంఈల నిర్వచనం మరింత విస్తరించామని అన్నారు. ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో ఎంఎస్‌ఎంఈలది కీలకపాత్ర అని..దేశ ప్రగతిలో ఎంఎస్‌ఎంఈలు ముఖ్య పాత్ర పోషించాల్సి ఉందని జవదేకర్‌ అభిప్రాయపడ్డారు. ఎంఎస్‌ఎంఈల కోసం రూ.50 వేల కోట్ల ఈక్విటీ పెట్టుబడులు పెట్టినట్లు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: