టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు చెక్ పెడుతూ...ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం గుడి ఛైర్మన్‌గా అశోక్ అన్న ఆనందగజపతి రాజు కుమార్తె సంచయితని నియమించిన విషయం తెలిసిందే. హఠాత్తుగా తనని తొలగించి సంచయితని ఛైర్మన్‌గా నియమించడం చెల్లదని చెబుతూ అశోక్ హైకోర్టు మెట్లు ఎక్కారు. అయితే అప్పటి నుంచి సంచయిత పరోక్షంగా అశోక్ గజపతిపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా విజయనగరంలోని మూడు లాంతర్ల కూల్చివేసినప్పుడు అశోక్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

 

దీనికి కౌంటర్‌గా సంచయిత కూడా స్పందిస్తూ... విజయనగరంలో మూడు లాంతర్ల స్తంభంపై చంద్రబాబు, తన బాబాయ్ అశోక్ గజపతి రాజు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాట్లాడారు. మాన్సాస్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజు ఉన్నసమయంలో.. విజయనగరం చరిత్ర, సంస్కృతికి ప్రతీక అయిన 1869 నాటి మోతీమహల్‌ను పునరుద్ధరించకుండా ఎందుకు ధ్వంసం చేశారని ఆమె ప్రశ్నించారు.

 

ఇక సంచయిత అలా మాట్లాడటంపై అశోక్ కూడా కౌంటర్ ఇచ్చారు.  మాన్సాస్ ట్రస్ట్‌లకు మళ్లీ తానే చైర్మన్‌ను అవుతానని... కోర్టులపై తనకు నమ్మకం ఉందని, 2014 తన అన్న ఆనంద గజపతి రాజు శిధిలావస్థలో ఉన్న మోతీమహల్‌ను ప్రభుత్వ అనుమతితో కూల్చి వేసారని చెప్పారు. ఆనాడే సంచయిత ప్రశ్నించి ఉంటే బాగుండేదని అన్నారు. అలాగే సంచయిత కుటుంబం వాడిన బాషకి నాడు ఆనంద్ గజపతి చాలా బాధపడేవారని మాట్లాడారు.

 

అయితే రాజు గారి కుటుంబంలో ఈ రగడ ఇలాగే కొనసాగేలా కనిపిస్తోంది. కాకపోతే ఈ మధ్య హైకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పులు వస్తున్న నేపథ్యంలో, మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కూడా వ్యతిరేక తీర్పు వస్తుందని అశోక్ బాగా నమ్మకంగా ఉన్నారు. ఇదే సమయంలో తన పదవికి ఎలాంటి ఢోకా లేదని సంచయిత కూడా ధీమాగా ఉన్నారు. మరి చూడాలి హైకోర్టులో వచ్చే తీర్పు బట్టి పైచేయి ఎవరిదో తెలిసిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: