ఏపీలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో సీఎం జగన్...మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్‌గా, కర్నూలుని జ్యూడిషయల్ క్యాపిటల్‌గా, విశాఖపట్నంని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష టీడీపీ వ్యతిరేకించింది. అన్నీ ప్రాంతాలని అభివృద్ధి చేస్తూనే, అమరావతిని రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఇక దీని కోసం కొన్ని రోజులు పోరాటం కూడా చేశారు. అటు అమరావతి రైతులు దీనిపై ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు.

 

అయితే జగన్ ప్రభుత్వం మాత్రం ఈ నిర్ణయంపై ముందుకెళ్లడంలో భాగంగా మూడు రాజధానుల బిల్లుని అసెంబ్లీలో ఆమోదించి, మండలికి పంపింది. కానీ మండలిలో టీడీపీకి మెజారిటీ ఉండటంతో ఆ బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లింది. దీంతో జగన్ మండలి రద్దుకే నిర్ణయం తీసుకుని, కేంద్రం ఆమోదానికి పంపారు. అయితే మండలి రద్దు, మూడు రాజధానుల అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

 

కానీ ఈలోపు రాజ్యాంగపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జగన్ రాజధాని ప్రక్రియని చేపట్టాలనుకునే సమయంలో, హైకోర్టులో టీడీపీ నేతలు వేసిన కేసులతో ఆ ప్రక్రియ  కూడా పెండింగ్ లో పడింది. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా ప్రభావంతో మూడు రాజధానులు ప్రక్రియ పక్కకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఈ ప్రక్రియ మళ్ళీ మొదలయ్యే అవకాశముందని ప్రచారం జరుగుతుంది.

 

త్వరలోనే విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రక్రియ మొదలవుతుందని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కన్నబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఆ ప్రచారానికి ఊతమిస్తున్నాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని చెప్పారు. అలాగే విశాఖ భూకుంభకోణాలపై సిట్ దర్యాప్తు చేస్తోందని, ఎంతటి వారున్నా సరే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. చంద్రబాబు హయాంలోనే భూముల అమ్మకం మొదలైందని వ్యాఖ్యానించారు.

 

అయితే కన్నబాబు మాటలు బట్టి చూస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్లే కనిపిస్తోంది. ఇక విశాఖలో చంద్రబాబు హయాంలో భూములు అమ్మకాల్లో ఎలాంటి స్కామ్ జరగలేదని, కానీ ఇప్పుడు జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ప్రకటించాక పెద్ద ఎత్తున భూముల స్కాములు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సిట్ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితే అన్ని వాస్తవాలు బయటపడతాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: