విజయసాయిరెడ్డి.. ఇప్పుడు ఈ పేరు తెలియనివారు ఏపీలోనే ఉండరు. అధికార వైసీపీలో ఆయన స్థానం నెంబర్ టూ అని అంతా చెప్పుకుంటారు. పార్టీ అధినేతకు ఆయనంత సన్నిహితుడు ఎవరూ ఉండరేమో. సొంత బంధువుల కన్నా జగన్ కు ఆయనపైనే గురి ఎక్కువ. రాజకీయాల పరంగానే కాదు.. ఓ ఆడిటర్ గా జగన్ వ్యాపారాల్లోనూ విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర.

 

 

జగన్ వెంట కష్టకాలంలో నిలిచిన వ్యక్తి విజయసాయిరెడ్డి. జగన్ వెంట జైలుకు సైతం వెళ్లి వచ్చిన వ్యక్తి. అయితే ఇటీవలి కాలంలో జగన్ కూ, విజయసాయిరెడ్డికీ విబేధాలు వచ్చాయన్న ప్రచారం జరుగుతోంది. కొన్ని చానళ్లు, పత్రికల్లో ఈ తరహా వార్తలు వచ్చాయి. అందులోనూ ఎల్జీ పాలిమర్స్ ఘటన సమయంలో జగన్ విజయసాయిరెడ్డిని కారు నుంచి దింపేసి మంత్రిని ఎక్కించుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లారన్న ప్రచారమూ సాగింది.

 

 

అయితే అవన్నీ ఊహాగానాలే. మరి వాస్తవం ఏంటో స్వయంగా విజయసాయిరెడ్డే మీడియా ముందు చెప్పారు. తనకు వై.ఎస్. కుటుంబానికి ఉన్న అనుబందం విడదీయలేనిదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ తోనే జీవితాంతం కొనసాగుతానని క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారాలు కావాలని ఎవరో చేస్తే నమ్మనక్కర్లేదని విజయిసాయిరెడ్డి అన్నారు. సాధారణంగా ఇటువంటి ప్రచారాలు తెలుగు దేశం అనుకూల మీడియాలో వస్తుంటాయన్న విజయసాయిరెడ్డి.. ఎందుకో ఇటీవల ఎన్‌టీవీలోనూ ఇలాంటి కథనం రావడం ఆశ్చర్యం కలిగించిందన్నారు.

 

 

ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు హైకోర్టు ధిక్కార నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. అలాంటి వారికి అండగా ఉంటామని విజయసాయిరెడ్డి స్పష్టంగా చెప్పారు. అదే సమయంలో వైసీపీ న్యాయ వ్యవస్థపట్ల పూర్తి గౌరవంతో ఉందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: