ఏపీలో జగన్ సర్కారుకు ఇటీవలి కాలంలో ఏపీ హైకోర్టులో అనేక ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ దెబ్బలు ఎంతగా తగిలాయంటే.. వైసీపీ అభిమానులు చివరకు హైకోర్టు న్యాయమూర్తులను కూడా సోషల్ మీడియాలో తప్పుబట్టే రేంజ్ కు చేరుకున్నాయి. అసలు ఏపీలో అసలు ప్రతిపక్షం హైకోర్టే అన్న స్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ పరంపరకు బ్రేక్ వేస్తూ ఏపీ హైకోర్టు నుంచి జగన్ సర్కారు ఓ మాంచి గుడ్ న్యూస్ వచ్చింది.

 

 

అదేమిటంటే.. గతంలో జగన్ సర్కారు మీడియాలో వచ్చే అడ్డదిడ్డమైన కథనాలకు చెక్ పెట్టేందుకు ఓ జీవో తీసుకొచ్చాడు గుర్తుందా.. ఆ జీవోపై యథాప్రకారం కొందరు హైకోర్టుకు వెళ్లారు. ఆ విచారణ సాగింది. ఆ తర్వాత.. జగన్ సర్కారు తెచ్చిన జీవోలో తప్పుబట్టాల్సిందేమీ లేదని ఏపీ హైకోర్టు చెప్పినట్టు ఏపీ సమాచార,పౌర సంబంధాల శాఖఓ ప్రకటనలో తెలిపింది. నిరాధారమైన, వాస్తవదూరమైన, తప్పుడు వార్తలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కల్గించే వార్తా కథనాలను పత్రికల్లో ప్రచురించడం, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2430 ను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ నంబర్ 173/2019 ను హైకోర్టు తోసి పుచ్చినట్టు పేర్కొంది.

 

 

 

అంటే.. తప్పుడు వార్తా కథనాలపై ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు చట్టప్రకారం రీజాయిండర్ లు విడుదల చేసేందుకు, అవసరమైన పక్షంలో కేసులు నమోదు చేసేందుకు అధికారాలు కల్పించడం జరిగిందన్నమాట. ఈ అంశంపై ప్రభుత్వం ఇచ్చిన వివరణను హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నదట. ఈ చర్య కేవలం క్రిమినల్ చర్యకు ఉద్దేశించినది కాదని పేర్కొన్న వివరణను కూడా హైకోర్టు పరిగణనలోకి తీసుకున్నదని ఆ ప్రకటన తెలిపింది.

 

 

ఈ జీవో ద్వారా పత్రికాస్వేచ్ఛను పరిమితం చేయడంగానీ, సమాచార సేకరణకు అనుమతి నిరాకరించడంగానీ, ప్రచురణ, పంపిణీ స్వేచ్ఛలను అరికట్టడం గానీ జీవో ఉద్దేశం కాదని ప్రతివాదులు పేర్కొన్న వివరణను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతే కాదు. పత్రికలు కూడా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల మేరకు వార్తా కథనాలు ప్రచురించుటం మంచిదని సలహా కూడా ఇచ్చిందట. సో.. మొత్తానికి జగన్ కు హైకోర్టు ఓ గుడ్ న్యూస్ చెప్పిందన్నమాట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: