నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జగన్ సర్కార్ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సాధారణ పరిపాలక శాఖ కార్యదర్శి నుంచి ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలైంది. జగన్ సర్కార్ హైకోర్టు తీర్పు అమలుపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేయాలని పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్, జస్టిస్ కనగరాజ్, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, ఎన్నికల కమిషన్ కార్యదర్శులను పిటిషన్ లో ప్రతివాదులుగా పేర్కొంది. 
 
పిటిషన్ లో ఎన్నికల కమిషనర్ నియామకం గవర్నర్ విచక్షణ మేరకే ఉంటుందని హైకోర్టు పొరపాటు పడిందని... కొన్ని ప్రత్యేక సందర్భాలు మినహా గవర్నర్ రాజ్యాంగ అధికారాలను కేబినెట్ సలహా, సిఫారసుల మేరకే ఉపయోగిస్తాడని పిటిషన్ లో పేర్కొంది. సుప్రీంకోర్టు ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకం ప్రత్యేక సందర్భాల పరిధిలోకి రాదని పిటిషన్ లో పేర్కొంది. 
 
హైకోర్టు అధికరణ 243కే, 243జెడ్.ఏల ప్రకారం పదవీ కాలానికి, సర్వీసు నిబంధనలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించలేదని అందువల్ల తీర్పును రద్దు చేయాలని.... హైకోర్టు ఎన్నికల కమిషనర్ ను నియమించే అధికారం రాష్ట్రాలకు లేదని చెప్పిందని... గతంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ సిఫారసు మేరకే నియమితులయ్యారని.... ఆయన నిమామకం కూడా చెల్లదని పేర్కొంది. 
 
హైకోర్టు విరుద్ధమైన తీర్పు ఇచ్చిందని.... అందువల్ల తీర్పును రద్దు చేయాలని కోరింది. హైకోర్టు జస్టిస్ కనగరాజ్ వయస్సును కారణంగా చూపుతూ ఆర్డినెన్స్ ను కొట్టేయడం పొరపాటేనని... సంబంధం లేని వ్యక్తులు దాఖలు చేసిన వ్యాజ్యాలను విచారించడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని తెలిపింది. నిమ్మగడ్డ వ్యవహారంలో ఊహించని ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. కోర్టు తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాల్సి ఉంది.         

మరింత సమాచారం తెలుసుకోండి: