క‌రోన‌రా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న త‌రుణంలో...దేశీయ విమాన ప్ర‌యాణాల‌కు కేంద్రం ఓకే చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. సుమారు రెండు నెలల తర్వాత దేశ‌వ్యాప్తంగా విమాన ప్ర‌యాణాలు అందుబాటులోకి వ‌చ్చాయి. అదే విధంగా శంషాబాద్‌ విమానాశ్రయంలో దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే, తాజాగా ఈ స‌ర్వీసుల‌ను పొందే ప్ర‌జ‌ల‌కు కీల‌క ఆదేశాలు జారీ అయ్యాయి. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా రాకపోకలు సాగించే వారెవరైనా శానిటైజ్‌ చేసిన ఆధీకృత క్యాబ్‌ల్లోనే ప్రయాణించాలని జీఎమ్మార్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సూచించింది. 

 


విమాన ట్రాఫిక్‌ క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రయాణికుల ఆరోగ్యం దృష్ట్యా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు జీఎంఆర్ సంస్థ వెల్ల‌డించింది. మేరు, స్కైక్యాబ్‌, ఓలా, ఉబెర్‌, వన్‌కార్‌, శ్రీనివాస టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ క్యాబ్‌లల్లో మాత్రమే ప్రయాణించాలని కోరారు. విమానశ్రయం ప్రాంగణంలో డిజిటల్‌ చెల్లింపులు, భౌతిక దూరం వంటి చర్యలు చేపట్టామ‌ని తెలిపింది. కాంటాక్ట్‌లెస్‌ చర్యలతోపాటు ఏయిర్‌పోర్టుకు వచ్చే ప్రతీ క్యాబ్‌ కూడా పూర్తిగా శానిటైజ్‌ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. విమానాశ్రయం ఆవరణలోకి వచ్చే ప్రతీ క్యాబ్‌ డ్రైవర్‌కు థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహించి అతడి శరీర ఉష్ణోగ్రతను నమోదు చేస్తున్నారు. ఉష్ణోగ్రత పెరిగినట్లు కనిపిస్తే క్యాబ్‌ను నడుపకుండా డ్రైవరును నిలిపేసి తదుపరి పరీక్షల కోసం ఏయిర్‌పోర్టు హెల్త్‌ ఆఫీసర్ల వద్దకు పంపుతున్నారు. డ్రైవర్‌ ఆరోగ్యంగా ఉన్నాడని తేలిన అనంతరం ప్రయాణికుల ఎదుటే క్యాబ్‌ను శానిటైజేషన్‌ చేపడుతున్నారు. దీంతో ప్రయాణికులకు తమ భద్రత పట్ల ధీమా కలుగుతుందని అధికారులు చెప్తున్నారు.

 

కాగా, ప్రతి ప్రయాణికుడి దగ్గర ఆరోగ్యసేతు యాప్‌ తప్పనిసరని ఇప్ప‌టికే ఆదేశాలు వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే. కరోనా లక్షణాలు కనిపిస్తే అన్ని రకాల పరీక్షలు వైద్యాధికారులు చేస్తున్నారు. కరోనా లక్షణాలు లేని వారికి 14 రోజుల క్వారంటైన్‌ అవసరం లేదని సైతం వెల్లడించింది.  ప్రతి ప్రయాణికుడు ప్రభుత్వం, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ సూచనలు పాటించాలని స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: