కేంద్ర ప్రభుత్వం ఐదో విడత లాక్ డౌన్ లో భాగంగా భారీగా సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ పోలీసు ఉన్నతాధికారులు రాష్ట్రంలో ప్రభుత్వం నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ప్రయాణాలపై షరతులు కొనసాగుతాయని తెలిపారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే వారి విషయంలో సరిహద్దు జిల్లాల్లో ఒక్కోచోట ఒక్కో విధానాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల ఈ పాస్ ను పరిశీలించి రాష్ట్రంలోకి అనుమతులు ఇచ్చారు, 
 
రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలలో ఈ పాస్ తో పాటు వైద్య పరీక్షలు నిర్వహించారని సమాచారం. ఐదో విడత లాక్ డౌన్ లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు అనుమతులు అవసరం లేదని... అదే సమయంలో రాష్ట్రాలు ఆంక్షలు విధించవచ్చని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికుల గురించి ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఆంక్షలు కొనసాగుతున్నాయి. 
 
ఈ పాస్ లు లేని వారిని పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించలేదు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం దగ్గర పోలీసులు ఆధార్ నంబర్, ఫోన్ నంబర్, చిరునామా ఇతర వివరాలను నమోదు చేసుకుని గుంటూరు జిల్లాకు చెందిన వారికి స్వాబ్ తీయడంతో పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని ముద్ర వేసి పంపారు. కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే అనుమతించారు. 
 
కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ఆ రాష్ట్రాల నుంచి ఈ పాస్ తో వచ్చిన వారిని క్వారంటైన్ కు పంపుతున్నారు. తెలంగాణ నుంచి రాష్ట్రంలోకి వచ్చేవారిని కర్నూలు జిల్లా పుల్లూరు టోల్ గేట్ దగ్గర పోలీసులు ఆపి అనుమతి పత్రాలు ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం దగ్గర ఒడిశా నుంచి ఏపీకి వచ్చే వారందరికీ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు వచ్చేవరకు వారిని ప్రత్యేక శిబిరాల్లో ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: