నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసులో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తనను కావాలనే ఎస్ఈసీ పదవి నుంచి తప్పించారంటూ నిమ్మగడ్డ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు...ఆయన్ని వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కొనసాగించాల్సిందేనంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే తీర్పు వచ్చిన వెంటనే నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషనర్ బాధ్యతలని చేపట్టడానికి సిద్ధమైపోయారు.

 

ఈలోపు ఏపీ ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం ఎంట్రీ ఇచ్చి, హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జగన్ ప్రభుత్వం నిమ్మగడ్డకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అంతకముంది ఈ కేసుపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. అప్పటి వరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరారు.

 

అయితే సుప్రీంలో లీవ్ పిటిషన్ దాఖలు చేయడంతో, హైకోర్టులో వేసిన స్టే పిటిషన్‌ను జగన్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అదేవిధంగా జస్టిస్ కనగరాజ్ తరఫున వేసిన స్టే పిటిషన్‌ను కూడా వెనక్కి తీసుకుంది. మరి జగన్ ప్రభుత్వం ఈ సడన్ డెసిషన్ తీసుకోవడానికి కారణం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయడమే అని తెలుస్తోంది. కానీ సుప్రీంలో తీర్పు వచ్చేవరకు జగన్ ప్రభుత్వం వేచిచూడకుండానే హైకోర్టులో స్టే పిటిషన్‌ని ఎందుకు ఉపసంహరించుకుందో తెలియడం లేదు. ఒకవేళ సుప్రీంలో తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని వైసీపీ ప్రభుత్వం భావిస్తుందా? లేక వ్యతిరేకంగా వస్తుందని వెనక్కి తగ్గుతుందో అర్ధం కాకుండా ఉంది.

 

ఇదిలాఉంటే రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుందని ఏజీ శ్రీరామ్ చెప్పిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో తాను ఎస్ఈసీగా పదవీ బాధ్యతలను చేపట్టినట్లు రమేష్ కుమార్ ఇచ్చిన సర్క్యూలర్ ను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. దీంతో నిమ్మగడ్డ భవిష్యత్ సుప్రీం తీర్పు మీద ఆధారపడి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: