ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. దేశవ్యాప్తంగా ఐదో విడత లాక్ డౌన్ అమలు కావడంతో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులపై ప్రధానంగా దృష్టి పెట్టాయి. రాష్ట్రంలో జిల్లాల మధ్య ఇప్పటికే బస్సు సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచుతోంది. ఈ నెల 8 నుంచి ఆర్టీసీ ఇతర రాష్ట్రాలకు సైతం బస్సు సర్వీసులను నడపనున్నట్టు తెలుస్తోంది. 
 
ఇప్పటివరకు ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సు సర్వీసులకు అనుమతులు ఇవ్వలేదు. అయితే తాజాగా ఆర్టీసీ ఏసీ సర్వీసులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ విజయవాడ మార్గంలో ఇప్పటికే ఇంద్ర బస్సు సర్వీస్ ప్రారంభమైంది. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. డిమాండ్ కు అనుగుణంగా బస్సు సర్వీసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. 
 
దూర ప్రాంత బస్సులకు గతంతో పోలిస్తే డిమాండ్ భారీగా పెరిగిందని.... పల్లె వెలుగు బస్సులకు మాత్రం అంత ఆదరణ లేదని వారు చెబుతున్నారు. విశాఖ, రాజమండ్రి రూట్లకు బస్సులను పెంచుతున్నామని వారు అన్నారు. బస్సులో పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రయాణికులను అనుమతిస్తూ ఉండటంతో సర్వీసుల సంఖ్య పెంచాల్సి వస్తోందని తెలుస్తోంది. బస్సు సర్వీసులను ఆర్టీసీ పెంచడంపై ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 82 మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3200కు చేరింది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 40 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి కాగా రాష్ట్రంలో ప్రస్తుతం 927 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: