ఆర్ధిక కష్టాల నుంచి గట్టెక్కేలా చూడాలి..! పెండింగ్‌ సమస్యల్ని పరిష్కరించాలి. ఇదే లక్ష్యంతో మరోసారి ఢిల్లీ బాట పట్టాలనుకున్న ఏపీ సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో పాటు మరికొందరు మంత్రులు, అధికారులతో సమావేశమై తమ సమస్యలను వివరించుకోవాలనుకున్న జగన్.. తన పర్యటనను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. 

 

లాక్‌డౌన్‌ తర్వాత తొలి సారి ఢిల్లీ వెళ్లాలనుకున్న ఏపీ సీఎం జగన్ టూర్ పోస్ట్ పోన్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో  తాజా పరిస్థితులను వివరించడంతో పాటు ఆర్థిక పరిస్థితి, కేంద్ర సాయంపై ఢిల్లీ పెద్దలతో చర్చించాలనుకున్నారు. తీరా ఈ ఉదయం పదిన్నరకు ఢిల్లీ  బయల్దేరాలనుకున్న ఆయన.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిజీ షెడ్యూల్ లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం రావడంతో పర్యటనను విరమించుకున్నారు. 

 

కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులపై ఇప్పటికే రెండు సార్లు ప్రధానికి లేఖలు రాశారు జగన్. అమిత్‌ షాతో భేటీలో రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు, వివిధ రంగాలకు కేంద్రం నుంచి ఆశిస్తున్న సాయం గురించి వివరించాలనుకున్నారు. అలాగే శాసన మండలి రద్దు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వ్యవహారంపై కూడా చర్చించేవారు.

 

ఇటు తెలంగాణతో కృష్ణా, గోదావరి జలాల పంపకంపై వివాదాలు తెర మీదకు వచ్చాయి. ఈ అంశానికి సంబంధించి వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల అధినేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇరిగేషన్‌ శాఖ మంత్రిని కలిసి వివరించే అవకాశం ఉంది. ఇటు ఎల్జీ పాలిమర్స్‌ ఘటన విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రంతో ఇప్పటికే అధికారుల స్థాయిలో సంప్రదింపులు జరిపారు. అంతర్జాతీయ కంపెనీ కావడంతో ఆ సంస్థపై చర్యల విషయంలో పాటించాల్సిన ప్రొసీజర్స్‌పై చర్చించాల్సి ఉంది. ఇక కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సంబంధించి ముడి ఇనుము సరఫరా కోసం కేంద్రం నుంచి కొన్ని అనుమతులు రావాల్సి ఉంది. 

 

అలాగే ఎస్‌ఈసీ నియామకంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురవుతున్న ఇబ్బందులు... కొత్త ఆర్డినెన్స్‌ వంటి విషయాలను కేంద్రం దృష్టికి త్వరలో తీసుకెళ్లే అవకాశముంది. మండలిని రద్దు చేయాలంటూ గతంలోనే ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానం ఇంకా కేంద్రం వద్దే పెండింగులో ఉంది. ఒక వేళ ఢిల్లీ పర్యటన జరిగి ఉంటే అమిత్ షాతో పాటు ఢిల్లీ పెద్దలతో సంప్రదింపులు జరిపేవారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: