దేశానికి మరో తుఫాన్‌ గండం ముంచుకొస్తోంది. సూరత్‌కు దక్షిణ నైరుతి దిశలో కేంద్రీకృతమైన అల్పపీడనం తుపాన్‌గా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికి నిసర్గ అని పేరు పెట్టారు. ఇటీవలే అంపన్‌ సైక్లో బెంగాల్‌, ఒరిస్సాలలో బీభత్సం సృష్టించింది. ఇప్పుడు నిసర్గ ప్రభావం ఎలా ఉంటుందోనన్న టెన్షన్‌ వెంటాడుతోంది. ఇటు కేరళ తీరాన్ని నైరుతి తాకడంతో వానలు మొదలయ్యాయి. 

 

ఆగ్నేయ అరేబియా సముద్రంలో రెండ్రోజుల క్రితం అల్పపీడనం ఏర్పడింది. ఇది గోవాలోని పాంజిమ్‌కు నైరుతి దిశగా ముంబయి, సూరత్‌లకు దక్షణ నైరుతి దిశగా కేంద్రీకృతం అయింది. ఈ అల్పపీడనం తుఫాన్‌గా మారనుందని వాతావరణ శాఖ చెబుతోంది. దీనికి నిసర్గ అని పేరు పెట్టారు. ఇది రేపు సాయంత్రానికి దక్షిణ గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్ర తీరాలను తాకవచ్చంటున్నారు.  సూపర్‌ సైక్లోన్‌ అంపన్‌ కొద్ది రోజుల క్రితమే పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలలో విధ్వంసం సృష్టించింది. ఇప్పడు మరో తుఫాన్‌ సిద్ధంగా ఉండడంతో అప్రమత్తమైంది కేంద్రం. 

 

ముఖ్యంగా గుజరాత్‌, ఉత్తర మహారాష్ట్రల్లో వంద కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. అలాగే రేపు,  ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇటు తెలంగాణలో కూడా పలు చోట్ల వర్షాలు పడతాయని అంటున్నారు అధికారులు. వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీవర్షాలు పడే అవకాశం ఉంది. 

 

మరోవైపు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. మండుతున్న ఎండలు... ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో  రుతుపవనాలు వచ్చాయన్న వార్త ఉపశమనం కల్గించింది. లక్షదీవులు, మాల్దీవులు, కేరళలోని పలు ప్రాంతాల్లో నైఋతి రుతుపవనాలు విస్తరించాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌, కోమోరిన్, ఏపీలోకి కూడా రుతుపవనాలు ప్రవేశించినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఇటు వేడి మాత్రం ఇంకా కొనసాగుతుందని అంటున్నారు. 

 

ఇటు నైరుతి రుతుపవనాల వల్ల ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. జూన్‌లో దేశ వ్యాప్తంగా 102 శాతం, జులైలో 103, ఆగస్టులో 93 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 102 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: