ఇంకా "యువరాజు'' గానే పిలిపించుకొంటున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి అప్పుడు రిటైర్ మెంట్ గురించి ఆలోచనలు వస్తున్నాయి! రాజకీయాల నుంచి తప్పుకొన్న తర్వాత ఏం చేయాలి? అనే విషయం గురించి ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాడు. ఈ విషయంలో ఆయనకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చిందట... రాజకీయాల నుంచి తప్పుకొన్నాకా అరుణచల్ ప్రదేశ్ అడవుల్లో గడిపేయాలని రాహుల్ చెబుతున్నాడు! ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించుకొన్నాడు. అరుణాచల్ ప్రదేశ్ అడవుల్లోని సౌందర్యం తనను మంత్రముగ్ధుడిని చేసిందని అందుకే అక్కడ సెటిల్ కావాలని భావిస్తున్నానని రాహుల్ చెప్పుకొచ్చాడు. మరి ఇదేదో అప్పటికప్పుడు సరదాగా చెప్పిన మాట అయితే పర్వాలేదు కానీ... ఇంకా సరిగా కెరీర్ మొదలుపెట్టకముందే, నాయకుడిగా ఎన్నికలను ఎదుర్కొనక ముందే రాహుల్ గాంధీ రిటైర్ మెంట్ గురించి ప్రకటనలు చేస్తే పక్కవాళ్లకు అలుసయిపోయే అవకాశం ఉంది. కాంగ్రెస్ యువరాజు అప్పుడే రాజకీయాల నుంచి తప్పుకోవడం గురించి ఆలోచిస్తున్నాడు చూడండి... అంటూ ఎగతాళి చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ ను ఏ విషయంలోనూ వదలడం లేదు. అవకాశం దొరికేతే చాలు రాహుల్ తీరుపై ఆయన విరుచుకుపుడుతున్నాడు. మరి వారికి ధీటుగా సమాధానం చెప్పాల్సిన రాహుల్ గాంధీ రిటైర్ మెంట్ ప్లాన్ గురించి వ్యాఖ్యానించడం సరికాదని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. ఒకవైపు కాంగ్రెస్ పని అయిపోయిందని సర్వేలు వ్యాఖ్యానిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పోటీ చేసినా వంద సీ ట్లు వచ్చే అవకాశం కూడా లేదని అవి స్పష్టం చేస్తున్నాయి. వాటిని హాస్యస్పదమైన అంచనాలుగా కొట్టి పారేస్తున్న రాహుల్ గాంధీకి ఉన్నట్టుండి ఈ రిటైర్ మెంట్ ఆలోచన ఎందుకొచ్చిందో!

మరింత సమాచారం తెలుసుకోండి: