తెలంగాణ ఏర్పడి ఆరేళ్లు పూర్తవుతోంది. ఈ ఆరేళ్లూ అధికారంలో ఉన్నది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీయే. అంతే కాదు..ఇక ఇప్పట్లో ఆ పార్టీకి ఎదురు నిలిచే దృశ్యం ఏ పార్టీకి కనిపించడం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ఉన్నా.. తెచ్చిన పార్టీగా టీఆర్‌ఎస్‌ కే జనం జైకొట్టారు. వరుసగా కేసీఆర్ రెండు సార్లు అధికారం దక్కించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ దే హవా.

 

 

రాజకీయంగా పరిస్థితి ఇలా ఉంటే.. అటు పత్రికల పరంగానూ కేసీఆర్ కు ఇప్పుడు ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు కేసీఆర్ ను విమర్శించే పత్రికలు తెలంగాణలో బూతద్దం పట్టుకుని వెదికినా కనిపించే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చిన మొదట్లో పరిస్థితి ఇలా ఉండేది కాదు. అప్పట్లో తెలంగాణ పత్రికగా ఒక్క నమస్తే తెలంగాణ మాత్రమే ఉండేది. దానికి అనుబంధంగా టీ న్యూస్ ఉండేది. అప్పట్లో మిగిలిన పత్రికలు, ఛానళ్లు ఒకటీ అరా తప్ప దాదాపు అన్నీ ఆంధ్రా మూలాలు ఉన్నవే.

 

 

కానీ ఆరేళ్లలో కేసీఆర్ మీడియా పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. అధికారంలోకి వచ్చిన కొత్తలోనే టీవీ9, ఏబీఎన్ ఛానళ్లపై అనధికార నిషేధం తర్వాత మిగిలిన చానళ్లు, పత్రికలు కూడా కేసీఆర్ ను విమర్శించే సాహసం చేయలేదు. టీఆర్ఎస్ బలంగా ఉండటం.. తమకు ఆంధ్రా మూలాలు ఉండటం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తర్వాత క్రమంగా టీవీ9, 10 టీవీ వంటి చానళ్లను కేసీఆర్ మిత్రుడు మైహోం రాజేశ్వరరావు హస్తగతం చేసుకోవడంతో అవీ దారికొచ్చేశాయి.

 

 

ఇక పత్రికల్లో ఈనాడు, సాక్షి తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ తో మిత్రభావంతోనే ఉన్నాయి. కేసీఆర్ కూడా రామోజీరావు వంటి వారిని స్వయంగా కలిసి వారి గొప్పదనాన్ని ఆకాశానికెత్తేశారు. చాలా కాలం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అనేలా ప్రవర్తించిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా ఇప్పుడు జై కేసీఆర్ అంటున్నాడు. ఇక ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ను విమర్శించేందుకు ఒకే ఒక్క టీవీ, పత్రిక కనిపిస్తున్నాయి. అవే వెలుగు పత్రిక, వీ6 న్యూస్ ఛానల్. మాజీ టీఆర్ఎస్ నేత వివేక్ ఆధ్వర్యంలోని ఈ మీడియా ఇటీవల ఆయన బీజేపీలో చేరడంతో కాస్త దూకుడు ప్రదర్శిస్తున్నాయి. విషయాన్ని బట్టి కేసీఆర్ సర్కారును నిలదీస్తున్నాయి. ఇవి తప్ప ప్రధాన పత్రికలు కేసీఆర్ జోలికొచ్చే సాహసం చేయడం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: