అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు చల్లారడం లేదు. దీంతో ఆర్మీని రంగంలోకి దించుతామని ట్రంప్ హెచ్చరించారు. తక్షణమే రాష్ట్రాల గవర్నర్లు లా అండ్ ఆర్డర్ ను అదుపులోకి తేవాలని, లేకపోతే మిలటరీ క్షణంలో సమస్యను పరిష్కరిస్తుందని స్పష్టం చేశారు. మరోవైపు జార్జ్ ఫ్లాయిడ్ ది హత్యేనని పోస్ట్ మార్టమ్ నివేదిక తేల్చింది. 

 

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంతో రగిలిన అశాంతి, కార్చిచ్చులా రగులుతోంది. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌‌వద్ద భారీ స్థాయిలో నిరసన చెలరేగడంతో భారీ ఎత్తున సైన్యాన్ని రంగంలోకి దించుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. రాజధాని నగరంలో హింసాత్మక నిరసనలను అరికట్టడానికి అదనపు బలగాలను పంపుతున్నామన్నారు. 

 

జార్జ్ ఫ్లాయిడ్ మృతితో దేశవ్యాప్తంగా నిరసన పేరుతో నగరంలో చాలా అమర్యాదకరమైన ఘటనలు చోటు చేసుకున్నాయని, అవి శాంతియుత నిరసనలు కావంటూ మండిపడ్డారు. ఈ అల్లర్లను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ఆయన పేర్కొన్నారు. వాషింగ్టన్‌లో అల్లర్లు, దోపిడీలు, దాడులు, ఆస్తి విధ్వంసాలను ఆపడానికి వేలాది మంది సాయుధ సైనికులు, ఇతర పొలీసు అధికారులను పంపిస్తున్నానని ప్రకటించారు. 

 

శాంతిభద్రతల అధ్యక్షుడిగా తనని తాను ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు ఆస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, హింసను నియంత్రించడానికి వీలైనంత ఎక్కువ నేషనల్ గార్డ్ దళాలను ఉపయోగించాలని గవర్నర్లను ట్రంప్ కోరారు. అలాగే అలర్లకు పరోక్షంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లే కారణమని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలామంది గవర్నర్లు శక్తిహీనులుగా మారారని మండిపడ్డారు.  అల్లర్లు జరిగిన చారిత్రాత్మక సెయింట్ జాన్ చర్చిని, రెండో ప్రపంచ యుద్ధం స్మారక కట్టడాన్ని ట్రంప్‌ సందర్శించారు. అటు జార్జ్ కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. నిరసనలు శాంతియుతంగా ఉంటే సమస్య లేదని, కానీ అరాచక శక్తులు చొరబడ్డాయని మండిపడ్డారు ప్రెసిడెంట్. 

 

జార్జ్ ఫ్లాయిడ్‌ మరణంపై అమెరికా ఉక్కిరిబిక్కిరౌతున్న సమయంలో కీలక మైన పోస్ట్‌మార్టం నివేదిక వెలువడింది. అతని మెడపై బలమైన ఒత్తిడి వలనే చనిపోయాడని, ఇది నరహత్య అని మినియాపోలిస్‌లోని హెన్నెపిన్ కౌంటీ వైద్యులు నిర్ధారించారు. పోలీసులు అదుపులో ఉండగా అతడు  గుండెపోటుకు గురైనట్లు నివేదిక తెలిపింది. అటు ఫ్లాయిడ్ కుటుంబం ఏర్పాటు చేసిన ప్రైవేట్ పరీక్షల విచారణలోనూ ఇది పోలీసుల హత్యగానే నిర్ధారణ అయింది. పోలీసుల  అమానుషంతోనే అతను మరణించాడని,  అంబులెన్సే  జార్జ్‌కు పాడెగా మారిందని అతడి లాయర్ వ్యాఖ్యానించాడు. 

 

నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యపై  టెక్‌ దిగ్గజాలు, గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ తమ విచారాన్ని, సంతాపాన్ని వ్యక్తం చేశాయి.  గూగుల్‌ సీఈవో  సుందర్‌ పిచాయ్‌, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల  జాతి వివక్షను, జాత్యంహకారాన్ని ఖండించారు.  నల్లజాతి సమాజానికి తమ సంఘీభావం తెలిపిన సత్య నాదెళ్ల సమాజంలో ద్వేషానికి, జాత్యహంకారానికి చోటు లేదని  వ్యాఖ్యానించారు. ఇప్పటికే  జార్జ్‌ ప్లాయిడ్‌ మృతిపట్ల  సెర్చ్ ఇంజీన్‌ దిగ్గజం గూగుల్‌  సానుభూతిని ప్రకటించింది. ఈ సంఘటన పట్ల భాధ, కోపం, విచారం, భయంతో  ఉన్న వారెవ్వరూ  ఏకాకులు కాదు.. జాతి సమానత్వానికి మద్దతుగా నిలబడతామని గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ట్వీట్‌ చేశారు.

 

అమెరికాలో దాదాపు 52 ఏళ్ల త‌ర్వాత ఇలాంటి ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.
11968లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ హత్య తర్వాత.. ఇలాగే నిరసనలు ఎగసిపడ్డాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: