ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయ‌డు త‌న‌యుడు నారా లోకేష్‌పై పేలే సెటైర్ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆయ‌న ప్రసంగాలు, రాజ‌కీయం నెరిపే తీరు, నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాల గురించి సోష‌ల్ మీడియాలో ప్ర‌త్యేకంగా కొన్ని పేజీలు ఏర్పాటు చేసి మ‌రీ ట్రోలింగ్స్ చేస్తున్నారు. వాటిపై భిన్నాభిప్రాయాలు ఉన్న‌ప్ప‌టికీ... కొన్ని సంద‌ర్భాల్లో లోకేష్ అవ‌కాశం ఇస్తారా? అనే రీతిలో ఆయ‌న తీరు ఉంటుంద‌ని మ‌రికొంద‌రు అంటుంటారు. తాజాగా మ‌ళ్లీ లోకేష్ బుక్క‌య్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా లోకేష్ చేసిన ట్వీట్‌పై తెలంగాణ వాదులు, టీఆర్ఎస్ పార్టీ అనుకూల వ‌ర్గాలు భ‌గ్గుమంటున్నాయి.

 

జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం అధికారికంగా కార్య‌క్ర‌మాలు చేప‌డుతోంది. వివిధ పార్టీలు సైతం త‌మ కార్యాల‌యాల్లో సంబురాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ త‌రుణంలో ట్విట్టర్లో లోకేష్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ``తెలంగాణ ఆవిర్భావ సంబురాలను ఘనంగా జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు. ఎందరో అమరవీరుల త్యాగాల ప్రతిఫలం తెలంగాణ రాష్ట్రం. రాష్ట్రావతరణ దినం సందర్భంగా ఆ అమరవీరుల స్మృతికి నివాళులర్పిస్తున్నాను`` అని లోకేష్ ట్వీట్ చేశారు.

 

అయితే, శుభ సంద‌ర్భాన తెలుగుదేశం పార్టీ యువ‌నేత చేసిన ట్వీట్‌పై ప‌లువురు నెట్టింట భ‌గ్గుమంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకొని ప్ర‌జ‌లు సంతోషంగా వేడుక‌లు జ‌రుపుకొంటుంటే...`దినం` అంటూ లోకేష్ శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఏంట‌ని అంటున్నారు. ఆవిర్భావ దినోత్స‌వం అని ఎందుకు లోకేష్ తెలియ‌జేయ‌లేక‌పోయార‌ని ఇటు ఫేస్‌బుక్‌లో పోస్టులు అటు ట్విట్ట‌ర్లో ట్వీట్లు చేస్తున్నారు. శుభ‌సంద‌ర్భాన్ని దినంతో పోల్చ‌డం మ‌ళ్లీ లోకేష్ త‌న ప‌రిణ‌తిని చాటుకున్నార‌ని ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. మొత్తం తెలుగుదేశం పార్టీ యువ‌నేత మ‌ళ్లీ బుక్కాయ‌డ‌ని ఇంకొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: