అగ్ర‌రాజ్యం అమెరికాలో ఇప్పుడు సీన్ మారిపోయిన సంగ‌తి తెలిసిందే. జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల ‌జాతీయుడు మిన్నియాపోలీస్ పోలీసుల చెర‌లో చ‌నిపోవ‌డంతో.. అమెరికా అంత‌టా నిర‌స‌న‌లు హోరెత్తాయి. అనేక న‌గ‌రాల్లో ఆందోళ‌న‌క‌రాలు బీభ‌త్సం సృష్టించారు. అమెరికా అధ్య‌క్షుడి భ‌వ‌న‌మైన‌ వైట్‌హౌజ్‌ను కూడా దిగ్భంధించారు. ఓ ద‌శ‌లో భ‌ద్ర‌తా ద‌ళాలుట్రంప్‌ను శ్వేత‌సౌధంలోని బంక‌ర్‌లోకి కూడా తీసుకువెళ్లారు. అమెరికాలోని దాదాపు అన్నిరాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో ట్రంప్ షాకింగ్ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ప‌రిస్థితి ఇప్పుడు తొక్క‌లో ట్రంప్ అనే స్థితికి చేరింది. తాజాగా ఓ పోలీస్ అధికారి అదే కామెంట్లు చేశారు. 

 

జార్జ్‌ ఫ్లాయిడ్‌ పోలీసుల చెరలో చనిపోవడాన్ని నిరసిస్తూ అమెరికాలో ఆందోళనలు మిన్నంటగా దానిపై సోష‌ల్ మీడియా‌లో ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లుగా తయారయ్యాయి. లూటింగ్‌ మొదలైతే.. షూటింగ్‌ తప్పదని హెచ్చరిస్తూ ట్రంప్ హెచ్చ‌రించారు. అనంత‌రం వైట్‌హౌజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ  జార్జ్ ఫ్లాయిడ్ మృతి ప‌ట్ల ప్ర‌తి అమెరిక‌న్ ప‌శ్చాతాపం వ్య‌క్తం చేస్తున్నార‌ని, కానీ కొంద‌రి ఆగ్ర‌హానికి ఎవ‌రూ బ‌లికావ‌ద్దు అని అన్నారు. దేశ ‌రాజ‌ధానిలో జ‌రుగుతున్న లూటీలు, హింస‌.. అవ‌మాన‌క‌ర‌మ‌ని తెలిపారు.  వాషింగ్ట‌న్ డీసీకి వేలాది మంది సైనికులను, పోలీసు అధికారుల్ని మోహ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ చెప్పారు. లూటీలు, విధ్వంసం, దాడులు ఆపేందుకు, ప్రాప‌ర్టీల‌ను ర‌క్షించుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. హింస‌కు పాల్ప‌డుతున్న వారికి క‌ఠిన శిక్ష‌లు ఉంటాయ‌న్న సందేశాన్ని ఆయ‌న వినిపించారు. వివిధ న‌గ‌రాలు, రాష్ట్రాలు త‌మ ప్ర‌జ‌ల్ని కాపాడ‌లేక‌పోతే, అప్పుడు ఆర్మీని రంగంలోకి దింప‌నున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. వివిధ రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ట్రంప్‌.. అక్కడ కూడా ఇదే మాదిరి వ్యాఖ్యలు చేశారు. 'మీరు చాలా బలహీనంగా ఉన్నారు.. నిరసనకారులపై పైచేయి అనిపించుకోండి.. లేకపోతే ఇదంతా సమయం వృథా చేయడమే.. మీరు ఇలాగే ఉంటే వారు మీపైకెక్కి నాట్యం చేస్తారు' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీని పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

 

ఇలాంటి త‌రుణంలోనే టెక్సాస్‌ రాష్ట్రంలోని హ్యూస్టన్‌ నగర పోలీస్‌ చీఫ్‌ ఆర్ట్‌ అసేవెడో మాత్రం ట్రంప్‌కు ఓ రేంజ్‌లో షాకిచ్చారు. ట్రంప్‌ నోరు మూసుకోవాలంటూ సూచన చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల నిరసనకారుల ఆగ్రహం ఇంకా పెరుగుతుందని, ఇలా వ్యాఖ్యలు చేయడం వారిని రెచ్చగొట్టడమే అవుతుందని ఆయ‌న తేల్చిచెప్పారు. నిరసనకారులను రెచ్చగొట్టకుండా ట్రంప్‌ నోరు మూసుకొని ఉంటే పదివేలని సూచించారు. ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడటానికి బదులుగా ఏదైనా నిర్మాణాత్మక కార్యక్రమం ప్రకటిస్తే బాగుంటుందని చెప్పారు. 'మీకు చెప్పడానికి ఏమీ లేకపోతే.. చెప్పకండి' అనే డైలాగ్‌ను అసేవెడో ఉటంకించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: