తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ప‌లు హామీల్లో ముఖ్య‌మైన‌ది డ‌బుల్ బెడ్రూం ఇండ్లు. ఈ ఇళ్ల కోసం అనేక‌మంది అర్హులు ఎదురు చూస్తున్నారు. అయితే, తాజాగా హైదరాబాద్ విష‌యంలో పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్‌లో డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం 80 శాతం పూర్తయిందని.. ఆగస్టు నాటికి 50వేల ఇండ్లను లబ్ధిదారులకు అందజేస్తామని ప్ర‌క‌టించారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో లక్ష డబుల్‌ బెడ్రూం ఇండ్ల లక్ష్యం త్వరలో పూర్తవుతుందని.. దసరా నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే ప్ర‌భుత్వం ఓ వైపు మంచి ఉద్దేశంతో క‌దులుతుంటే మ‌రోవైపు మోసాలు జ‌రుగుతున్నాయి.

 

హైదరాబాద్‌లో డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణంపై ఇటీవ‌ల‌ ఎంసీఆర్‌హెచ్చార్డీలో గృహనిర్మాణశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం డబుల్‌బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిందని.. హైదరాబాద్‌లో లక్ష ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతున్నదని తెలిపారు. ఆగస్టు నాటికి 50 వేల మంది లబ్ధిదారులకు ఇండ్లను అందజేస్తామన్నారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నాయని వర్కింగ్‌ ఏజెన్సీలు తెలిపాయి. స్టీలు, సిమెంట్‌, ఇసుక వంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రుల దృష్టికి తీసుకొచ్చాయి. వీటిపై ఏజెన్సీలకు ప్రభుత్వం సహాయకారిగా ఉంటుందని, ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో మిగిలిన పనులను త్వరగా పూర్తిచేయాలని చెప్పారు. నిర్మాణాలు పూర్తయినచోట మౌలిక వసతుల ఏర్పాట్లను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఇండ్లను వెంటనే ఆధీనంలోకి తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

 

కాగా, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామంటూ.. అమాయకుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న మోసాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా ఉప్పల్‌ పోలీసులు ఇలాంటి ఓ నిందితుడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. రామంతాపూర్‌ వివేక్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌(48) ఆటోడ్రైవర్‌. ఇతని స్నేహితులు శశికాంత్‌, మోహన్‌లు రామంతాపూర్‌, వెంకట్‌రెడ్డినగర్‌లో నివాసం ఉంటున్నారు.కాగా.. ఈ ముగ్గు రు సులువుగా డబ్బులు సంపాదించాలని పథకం వేశారు. ఈమేరకు అమాయక ప్రజలను గుర్తించి, డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు ఇప్పిస్తామని నమ్మించి.. డబ్బులు వసూలు చేశారు. అయితే, ల‌బ్ధిదారుల‌కు అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దీంతో కూపీ లాగీ నిందితుడిని అరెస్టు చేశారు. అత‌ని నుంచి నకిలీ డబుల్‌ బెడ్‌రూం అలాట్‌మెంట్‌ ఆర్డర్‌ కాఫీలు, రూ.38వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: