విజయసాయిరెడ్డి...వైసీపీలో నెంబర్-2 పొజిషన్‌లో ఉండే నాయకుడు అని అంతా చెబుతూ ఉంటారు. అలాగే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి వైసీపీ పెట్టాక, జైలుకు వెళ్ళే సమయంలో ఆయనతో పాటు విజయసాయి కూడా జైలు జీవితం గడిపిన నాయకుడు. ఇక అక్కడ నుంచి మొదలుపెట్టుకుంటే జగన్ పడే ప్రతి కష్టంలోనూ విజయసాయి తోడుగా ఉంటూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ పార్టీ కోసం కష్టపడి చేశారు. రాజ్యసభ సభ్యుడుగా ఉంటూ కేంద్ర పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ...పార్టీకి ఎంత ఉపయోగం కలిగేలా చేశారు.

 

అటు విశాఖపట్నం ఎంపీగా విజయమ్మ ఓడిపోయిన దగ్గర నుంచి, అక్కడే ఉంటూ, పార్టీని బలోపేతం చేస్తూ, 2019 ఎన్నికల్లో మంచి ఫలితాలు దక్కేలా చేశారు. అలాగే వైసీపీకి భారీగా సీట్లు రావడంలో విజయసాయిరెడ్డి కష్టం కూడా బాగానే ఉంది. అధికారంలోకి వచ్చాక కూడా పార్టీలో కీలక నేతగా ఉంటూ, జగన్‌కు అండగా ఉంటున్నారు. అలాగే ఎప్పుడు ప్రతిపక్ష టీడీపీకు చుక్కలు చూపిస్తుంటారు.

 

అయితే వైసీపీలో ఇలా ముఖ్యనాయకుడుగా ఉన్న విజయసాయిరెడ్డిని టార్గెట్ చేసి దెబ్బ తీస్తే, తమకు లబ్ది చేకూరుతుందనే ఉద్దేశంలో టీడీపీ ఉన్నట్లు కనబడుతోంది. అందుకే ఈ మధ్య టీడీపీ నేతలందరూ విజయసాయిని టార్గెట్‌గా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. తాజాగా జగన్‌కు విజయసాయిల మధ్య గ్యాప్ వచ్చిందని ప్రచారం మొదలుపెట్టారు. అయితే ఈ ప్రచారానికి విజయసాయి క్లారిటీ ఇచ్చేవరకు వచ్చింది. ఆయన మీడియా సమావేశం పెట్టి తనకు జగన్‌కు ఎలాంటి విభేదాలు లేవని, ఇదంతా టీడీపీ ప్రచారమని, తానే చచ్చేదాకా పార్టీలోనే ఉంటానని ప్రకటన చేశారు.

 

ఇక దీనిపై కూడా టీడీపీ నేతలు కొత్త అర్ధాలు వెతుకుతున్నారు. సీఎం జగన్‌ కారులో నుంచి దించేశాక విజయసాయిలో మార్పు వచ్చిందని టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. చచ్చేదాకా పార్టీలోనే ఉంటానని విజయసాయి చెప్పారంటే.. జగన్‌ ఆయనను పక్కన పెట్టారని అర్ధమవుతుందని అంటున్నారు. మొత్తానికైతే విజయసాయిని టార్గెట్ చేసి టీడీపీ పనికిమాలిన రాజకీయం చేస్తున్నట్లు బాగా తెలుస్తోంది. కానీ ఈ రాజకీయానికి విజయసాయి ఏ మాత్రం లొంగరని కూడా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: