క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డిలో ముందంజ‌లో ఉన్న ఏపీ నేడు మ‌రో స‌రికొత్త రికార్డు సృష్టించబోతోంది. కరోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌ల్లో ఆంధ్రప్రదేశ్‌ మరో మైలురాయిని చేరుకోబోతోంది. బుధవారం నాటికి 4 లక్షల టెస్టులు చేసిన రాష్ట్రంగా రికార్డు సృష్టించనుంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో 3.95 లక్షల ప‌రీక్ష‌లు చేశారు. పది లక్షల జనాభాకు రాష్ట్రంలో సగటున 7,410 మందికి టెస్టులు చేస్తున్నారు. ఈ విషయంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 4 లక్షల టెస్టులు చేసిన రాష్ట్రాల్లో రాజస్తాన్, తమిళనాడు, మహారాష్ట్రలు మాత్రమే ఏపీ కంటే ముందున్నాయి. అయితే ఆయా రాష్ట్రాల జనాభాతో పోల్చుకుంటే ఏపీలో జనాభా చాలా తక్కువని.. దేశంలో మంగళవారం నాటికి 39.66 లక్షల పరీక్షలు జరగగా అందులో 3.95 లక్షల పరీక్షలు అంటే సుమారు 10 శాతం టెస్టులు ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగాయని సంబంధిత అధికారవ‌ర్గాలు చెబుతున్నాయి.

 

రాష్ట్రంలో ఇన్ఫెక్షన్‌ రేటు 0.96 శాతం ఉండగా దేశీయ సగటు 4.96 శాతంగా ఉంది. అదేవిధంగా ఏపీలో మ‌రొక ఆశాజ‌న‌క‌మైన‌ విష‌యం కూడా ఉంది.  దేశ వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుంటున్న వారి శాతంతో పోల్చితే రాష్ట్రంలో ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో రికవరీ శాతం 63.49 ఉండగా.. దేశ వ్యాప్తంగా చూస్తే ఆ శాతం 48.51గా నమోదైంది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 12,613 మందికి పరీక్షలు నిర్వహించగా 115 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మంగళవారం నమోదైన కేసుల్లో ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 33 మంది ఉన్నారని... దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,791కు చేరుకుందని అధికార‌వ‌ర్గాలు అంటున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 40 మంది డిశ్చార్జి కావడంతో మంగళవారం నాటికి వైరస్‌ నుంచి కోలుకున్న వారి సంఖ్య 2,407కు చేరిందని.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 1,320గా ఉందని వెల్ల‌డించాయి.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: