అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం బలపడి తుఫానుగా మారింది. ఈ తుఫాను పెను తుఫానుగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం అంఫన్ తుఫాను మిగిల్చిన నష్టాన్ని మరవక ముందే నిసర్గ రూపంలో మరో తుఫాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిసర్గ తుఫాను ఈరోజు మధ్యాహ్నానికి మహారాష్ట్రలోని అలీబాగ్ దగ్గర తీరాన్ని తాకనుంది. 
 
గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని.... మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలపై ఈ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కరోనా విజృంభణతో వణికిపోతున్న ముంబైకు మరో తుఫాను ముప్పు పొంచి ఉందన్న వార్తే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. నిసర్గ తుఫాను నేపథ్యంలో ప్రధాని మోదీ మహారాష్ట్ర, గుజరాత్ సీఎంలతో ఫోన లో మాట్లాడి వారికి భరోసానిచ్చారు. 
 
హోం మంత్రి అమిత్ షా కూడా తుఫాను ప్రభావం పట్ల ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తుఫాను నేపథ్యంలో ముంబై తీరంలో 144 సెక్షన్ అమలులో ఉంది. మహారాష్ట్ర సర్కార్ గురువారం మధ్యాహ్నం వరకు ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. 
 
తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్ది పేట, మేడ్చల్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి , జోగుళాంబ గద్వాల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు ఏపీలోని ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.            

మరింత సమాచారం తెలుసుకోండి: