ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన ఇళ్ల బకాయిలను వెంటనే చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు జగన్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 3,38,144 మందికి ప్రయోజనం కలగనుంది. 1,323 కోట్ల రూపాయల పెండింగ్ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుందని తెలుస్తోంది. నిన్న క్యాంప్ ఆఫీస్ లో సమీక్షా సమావేశం నిర్వహించిన జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 
 
జులై నెల 8వ తేదీన వైయస్సార్ పుట్టినరోజు సందర్భంగా ఇళ్లపట్టాలను పంపిణీ చేయనున్న నేపథ్యంలో సీఎం జగన్ ఈ కార్యక్రమం గురించి సమీక్షించారు. కేటాయించిన స్థలం దగ్గరే అక్కాచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని... భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని సీఎం సూచించారు. రాష్ట్రంలో తొలి విడతలో చేపట్టబోయే 15 లక్షల ఇళ్ల నిర్మాణం గురించి సమీక్షించి నెల్లూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఇళ్ల సంఖ్యను పెంచాలని సీఎం చెప్పారు. 
 
పేదలకు నిర్మించబోయే ఇళ్లలో కల్పించబోయే సదుపాయాల గురించి సీఎం అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సీఎంకు కిచెన్, బెడ్ రూం, లివింగ్ రూం, వరండా, మరుగుదొడ్డి సహా సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, నాణ్యతా ప్రమాణాలు పాటించి ఇళ్లను నిర్మించాలని సీఎం చెప్పారు. ఒక్క రూపాయి అప్పు అనేది లేకుండా పేదవాడికి ఇళ్లు సమకూరాలని సూచించారు. 
 
గతంలో ఎన్నడూ లేని విధంగా ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వం నాణ్యతతో పనులు చేస్తుందనే పేరు రావాలని అన్నారు. ఇళ్ల నిర్మాణం కొరకు ఏర్పాటు చేసే కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో గృహ నిర్మాణ శాఖా మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: