తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతున్న సంగ‌తి తెలిసిందే. కేసుల సంఖ్య పెరుగుతున్న నేప‌థ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు అనుమ‌తుల విష‌యంలో సైతం ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. అయితే, తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్‌ టవర్‌ను  ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చి (టిమ్స్‌)’గా తీర్చిదిద్దిన సంగ‌తి తెలిసిందే. అయితే, గ‌త కొద్దికాలంగా వైద్య‌ సేవ‌ల‌ ప్రారంభం కోసం ఎదురుచూస్తున్న టిమ్స్‌కు ఈ మేర‌కు స‌ర్కారు అనుమ‌తి ఇచ్చింది. 

 

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ క్రమంగా విస్తరిస్తున్న సమయంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి ముందుజాగ్రత్త చర్యగా గచ్చిబౌలి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను  ఆస్పత్రిగా మార్చింది. కేవలం 20రోజుల వ్యవధిలో స్పోర్ట్స్‌ టవర్‌ను 1500 పడకలతో అధునాతన హాస్పిటల్‌గా తెలంగాణ ప్ర‌భుత్వం తీర్చిదిద్దింది. ఈ విష‌యంలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌త్యేక చొర‌వ తీసుకున్నార‌ని మంత్రి కేటీఆర్ అభినందించారు. అనంత‌రం కరోనా తీవ్రతను అంచనా వేయడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బృందం హైదరాబాద్ వ‌చ్చి గచ్చిబౌలిలో కొత్తగా ఏర్పాటు చేసిన టిమ్స్‌లో సదుపాయాలను పరిశీలించింది. రాష్ట్ర ప్రభుత్వం టిమ్స్‌ను కరోనా రోగులకు అందుబాటులోకి తీసుకురావడంతో అక్కడి ఏర్పాట్లను అధ్య‌య‌నం చేసి ఓకే చెప్పింది. దీంతో వైద్య సేవ‌లు ప్రారంభించేందుకు స‌ర్కారు ముంద‌డుగు వేసింది. తాజాగా టిమ్స్ ఆస్పత్రిలో సిబ్బంది సేవలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

 

 

గ‌చ్చిబౌలి టిమ్స్‌లో 662 మంది సిబ్బంది సేవల వినియోగానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 662 మంది సిబ్బందిలో 502 మంది కాంట్రాక్ట్ బేసిస్‌లో , 12 మంది డిప్యుటేషన్ విధానంలో, 148 మంది ఔట్ సోర్సింగ్ విధానంలో సేవలు అందించేందుకు సర్కారు పర్మిషన్ ఇచ్చింది. వీరు ఏడాదిపాటు సేవలు అందించనున్నారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కాగా, ప్రస్తుతానికి ఈ హాస్పిటల్‌ను కోవిడ్‌-19 బాధితులకు చికిత్స అందిచేందుకు వినియోగిస్తారు. కరోనా మహమ్మారి కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం పట్టిన తర్వాత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌గా మార్చి వైద్యసేవలు, పరిశోధనలు నిర్వహించ‌నున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: