ఓ వైపు కరోనా భయంతో జనం బిక్కుబిక్కు మంటుంటే.. మరోవైపు మిడతలు పశ్చిమ భారత రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పంటపై దాడి మొదలు పెట్టేశాయి. వీటి నియంత్రణకు ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. అదే సమయంలో రైతులు సైతం ఈ మిడతలను ఆటకట్టించేందుకు రకరకాల ట్రిక్కులు ప్లే చేస్తున్నారు.

 

పాకిస్తాన్‌ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన మిడతల దండు... పశ్చిమ భారతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పంటలపై దాడి చేస్తూ రైతులను ముప్పు తిప్పలు పెడుతోంది. ఇప్పటికే.. మహారాష్ట్ర, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వేల ఎకరాల్లో తమ దాడిని మొదలెట్టాయి. దీంతో దేశమంతా కరోనాతో పోరాడుతుంటే... ఇక్కడి రైతులు ఈ మిడతల దండుతో పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ మిడతలు ఇతర రాష్ట్రాల్లోకీ ప్రవేశిస్తూ.. మరింత ఆందోళనను పెంచుతున్నాయి. 

 

గుంపులుగా లక్షల సంఖ్యలో తరలివచ్చే ఈ ఎడారి మిడతల దండు.. ఒక్కరోజులోనే 35వేలమంది తినేంత పంటను హాంఫట్‌ చేస్తాయట. అలాంటి మిడతల కారణంగా.. గత 27ఏళ్లలో ఎప్పుడూలేని పరిస్థితిని ఇప్పుడు భారత్‌ ఎదుర్కొంటోంది. ఈ మిడతల దండు పశ్చిమ భారతాన్ని భారీస్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మిడతల దండును అంతం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వేల ఎకరాల్లో పంట నాశనం కాకుండా, మిడతలను మట్టుపెట్టడానికి అత్యాధునిక స్ర్పేయర్లు, డ్రోన్‌లను సిద్ధం చేస్తోంది. మిడతల దాడిని అడ్డుకునేందుకు ఓవైపు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా... రైతులు సైతం తమ పంటను కాపాడుకునేందుకు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. పెద్ద పెద్ద శబ్దాలకు మిడతలు పారిపోతాయని వ్యవసాయశాఖ అధికారులు చెప్పడంతో పొలాల్లో టపాసులు పేలుస్తూ, డీజేలు ఏర్పాటు చేస్తున్నారు. 

 

మిడతలను తరిమికొట్టేందుకు ఓ వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. గాలి వీచినప్పుడల్లా శబ్దం చేసేలా ఓ పరికరాన్ని తయారు చేశాడు. పొడవాటి కర్రకు ఇనుప చువ్వ గుచ్చి దానికి ఒక ఖాళీ కూల్‌ డ్రింక్‌ బాటిల్‌ సెట్‌ చేశాడు. ఆ బాటిల్‌కు ముందువైపు ఫ్యాన్‌ రెక్కలు, వెనుక వైపు ఇనుప డబ్బాను అమర్చాడు. ఈ రెండింటిని ఒక ఇనుప చువ్వ ద్వారా కలిపి డబ్బా ఉన్న వైపు పైభాగాన డ్రమ్‌ స్టిక్స్‌లాంటివి అమర్చాడు. దాన్ని తీసుకెళ్లి పోలంలో నిలబెట్టడంతో గాలి వీచినప్పుడల్లా ఫ్యాన్‌ రెక్కలు వాటికున్న చువ్వతో పాటు తిరిగి డ్రమ్‌ స్టిక్స్‌లాంటివి డబ్బాపై శబ్దం చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. దీని వల్ల ఎప్పుడూ పొలంలో ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది.

 

గాలి గమనాన్ని బట్టి వచ్చే మిడతలు ఈ శబ్దానికి భయపడి పారిపోతాయని అక్కడి రైతులు భావిస్తున్నారు. ఈ వీడియోను ఐఎఫ్‌ఎస్‌ అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ తన ట్విటర్‌లో పంచుకున్నారు. ఆధునిక సమస్యకు ఆధునిక పరిష్కారం. మిడతలను ఎదుర్కొనడానికి స్థానిక ఆవిష్కరణలు ఉత్తమమైనవి. అద్భుతమైన ఆలోచన అంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోను నెటిజన్లు బాగా లైక్‌చేస్తున్నారు. ఈ పరికరాన్ని తయారు చేసిన వ్యక్తిని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: