రేపు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశానికి రంగం సిద్ధమైంది. ఏపీ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. దీనితో పాటు అనుమతి లేకుండా తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టుపై ఏపీ ఫిర్యాదులు చేయనుంది. ఇప్పటికే మీటింగ్ అజెండాను రెండు రాష్ట్రాలకూ పంపింది కృష్ణా బోర్డు. 

 

ఏపీ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ఫిర్యాదు చేసిన తరుణంలో.. ఏపీ కూడా అనుమతి లేకుండా తెలంగాణ ప్రాజెక్టులు నిర్మిస్తోందని కంప్లైంట్ చేసింది. దీంతో జూన్ 4న  హైదరాబాద్ జలసౌధలో ఉదయం 11 గంటలకు జరిగే కృష్ణా బోర్డు మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు చేపడుతున్న ప్రాజెక్టులు, అభ్యంతరాలు, ప్రాజెక్టుల డీపీఆర్ లు ఈ మీటింగ్ లో ప్రధాన అజెండాగా ఉన్నాయి. దీంతో పాటు వచ్చే సంవత్సరానికి సంబంధించి నీటి పంపకాలు, టెలీమెట్రీల ఏర్పాటు, శ్రీశైలం, సాగర్ కింద పవర్ వినియోగంపైనా చర్చ జరగనుంది. బోర్డుకు రెండు రాష్ట్రాల నుంచి రావాల్సిన నిధుల సంగతి కూడా ప్రస్తావనకు రానుంది. 

 

కృష్ణానదిపై ఏపీ సర్కారు కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులపై గత నెల 12న తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. దీనిపై గత నెల 20నే కేంద్ర జలశక్తి శాఖ ఏపీ సర్కారుకు లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిశీలన జరగకుండా, నదీజలాల అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని చెప్పింది. కొత్త ప్రాజెక్టులకు పాలన అనుమతి ఇస్తూ మే 5న ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 203 విభజన చట్టం 11వ షెడ్యూల్ లోని సెక్షన్ 84కు విరుద్ధమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన డీపీఆర్ కూడా కృష్ణాబోర్డుకు గానీ, కేంద్ర వాటర్ కమిషన్ కు గానీ ఇవ్వలేదని గుర్తుచేసింది. బోర్డు లేదా కమిషన్ పరిశీలన, అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు ఏపీ సర్కారు ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. 

 

ఇదే టైంలో పాలమూరుకు చెందిన ఓ రైతు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేసి పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిప్ట్ పనులపై స్టే తీసుకొచ్చారు. తెలంగాణకు రావల్సిన నీటి వాటాకు గండి కొడుతూ ఆంధ్ర ప్రాజెక్టులు నిర్మిస్తే న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అటు ఏపీ కూడా దీటుగానే వాదనలు రెడీ చేసుకుంది. కృష్ణా నదిపై అనుమతుల్లేకుండా తెలంగాణ చేపడుతోన్న ప్రాజెక్టుల వివరాలు ప్రస్తావిస్తూనే.. తమ ప్రాజెక్టుల వివరాలను అందించేందుకి సిద్దం అవుతోంది. మరో వైపు కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకోవాలనే డిమాండును ఈ భేటీలో ప్రస్తావించే అవకాశం ఏపీ వైపు నుంచి కన్పిస్తోంది.

 

ఎటువంటి అనుమతుల్లేకుండా పోతిరెడ్డిపాడు విస్తరణ చేపట్టడం ద్వారా శ్రీశైలం నుంచి ఎక్కువ నీటిని డ్రా చేసుకునేలా ఏపీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటోందనేది తెలంగాణ వాదన అయితే.. పాలమూరు-రంగారెడ్డి, భక్త రామదాసు, తుమ్మిళ్ల వంటి ప్రాజెక్టులే కాకుండా వివిధ ప్రాజెక్టుల ద్వారా సుమారు 200 టీఎంసీల నీటిని అదనంగా వాడుకునేందుకు తెలంగాణ సిద్దం అవుతోందనేది ఏపీ ఫిర్యాదు. గురువారం జరగనున్న భేటీలో ఏపీ తన వాదనలను వినిపించేందుకు సిద్దమైంది.

 

కేఆర్ఎంబీ సూచనల మేరకు ప్రాజెక్టుల వివరాలు అందివ్వడమే కాకుండా వాటిని ఎందుకు కట్టాల్సి వస్తోందనే అంశాన్ని వివరించనున్నారు ఏపీ అధికారులు. కేవలం వరద జలాలను మాత్రమే తరలించేందుకు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించనున్నారు. గతేడాది వచ్చిన వరదల కారణంగా సుమారు 2వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయాయని.. ఇలా వృధాగా సముద్రంలో కలిసిపోయే నీటిని ఒడిసి పట్టి రాయలసీమ ప్రాజెక్టులకు మళ్లించనున్నట్టు వెల్లడించనుంది ప్రభుత్వం. ఏపీకి జరిగిన కృష్ణా జలాల కేటాయింపుల మేరకే తాము వినియోగించుకుంటామని హామీ ఇవ్వనుంది. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాజెక్టులపై తాము గతంలోనే ఫిర్యాదులు చేసినా ఆ రాష్ట్రం వాటిని నిర్మిస్తూనే ఉందని గుర్తు చేయనున్నారు ఏపీ అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: