అమెరికాలో నిరసన జ్వాలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. కర్ఫ్యూ విధించినా.. జనం నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా వీధుల్లోకి వస్తున్నారు. న్యూయార్క్ లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి వారం రోజులు కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. జార్జ్ ఫ్లాయిడ్ సొంతూరు హ్యూస్టన్ లో ఆయనకు నివాళి అర్పించడానికి వేలాది మంది తరలివచ్చారు. ఉద్యమకారులు శాంతించాలని ఫస్ట్ లేడీ మెలనియా ట్రంప్ పిలుపునివ్వగా.. అమెరికా అంటే అర్థం తెలియనివాళ్లే నిరసనల్ని అణచాలనుకుంటారని మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ కామెంట్ చేశారు. 

 

మినియాపోలీస్ లో పోలీసుల కర్కశత్వానికి బలైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణం.. బ్లాక్స్ ఉద్యమానికి ఊపిరి పోసింది. మాకు ఊపిరాడటం లేదంటూ వాళ్లు చేస్తున్న నినాదాలు.. అమెరికా వీధుల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, హ్యూస్టన్, ఒకహోమా సిటీ, మినియాపోలీస్ లాంటి నగరాల్లో ఆందోళనలు తగ్గుముఖం పట్టలేదు. న్యూయార్క్ లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మొదటిసారి వారం రోజుల పాటు కర్ఫ్యూ విధించారు. మిగతా నగరాల్లో కూడా కర్ఫ్యూని ధిక్కరించి మరీ ప్రజలు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేస్తున్నారు. అయితే హింస తగ్గుముఖం పట్టడంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 

 

అటు జార్జ్ ఫ్లాయిడ్ సొంతూరు హ్యూస్టన్ లో వేల మంది ప్రజలు ఆయనకు నివాళి అర్పించారు. హాండ్స్‌ అప్‌-డోంట్‌ షూట్‌, నో జస్టిస్‌-నో పీస్‌ వంటి నినాదాలు చేశారు. ఫ్లాయిడ్ కు మద్దతుగా ఇంతమంది వస్తారనకోలేదని ఆయన కుటుంబం స్పందించింది. ఫ్లాయిడ్‌ కుటుంబానికి చెందిన 16 మందితో పాటు దాదాపు 60 వేల మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఫ్లాయిడ్ మరణాన్ని వృథా కానీయమని హ్యూస్టన్ మేయర్ నివాళి సభను ఉద్దేశించి ప్రసంగించారు. జార్జ్ చాలా మంచివాడని, ఆయనకు న్యాయం చేయాలని అతడి భార్య కన్నీళ్లతో వేడుకుంటున్న దృశ్యం అందర్నీ కదిలించింది. ఫ్లాయిడ్ మృతితో అతడి ఆరేళ్ల కూతురికి తండ్రి లేకుండా పోయాడు.

 

ఉద్యమంపై సైన్యాన్ని ప్రయోగిస్తామన్న ట్రంప్ వ్యాఖ్యలపై నిరసనలు వెల్లువెత్తడంతో.. వైట్ హౌస్ ఫస్ట్ లేడీని రంగంలోకి దించింది. అమెరికాలో ప్రతిఒక్కరూ కర్ఫ్యూ నిబంధనల్ని పాటించాలని.. వీధుల్ని వదిలి ఇళ్లకు చేరాలని మెలనియా ట్రంప్‌ కోరారు. శాంతియుత పద్ధతిలో నిరసన వ్యక్తం చేయాలని విజ్ఞప్తి చేశారు. కలిసి కట్టుగా పనిచేస్తేనే అన్ని నగరాల్లోని ప్రజలకు భద్రత కల్పించగలమని పేర్కొన్నారు. అంతకుముందు ఫ్లాయిడ్‌ కుటుంబం పట్ల ఆమె సానుభూతి వ్యక్తం చేశారు. 

 

ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా అమెరికాలో జరుగుతున్న ఆందోళనల పట్ల ఆ దేశ మాజీ అధ్యక్షుడు జార్జ్‌ డబ్ల్యూ బుష్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థ వైఫల్యాలను సమీక్షించి సమన్యాయం కోసం సమష్టిగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. నిరసనలే తమ దేశ బలమని.. వాటిని అణచివేయాలనుకుంటున్నవారికి అమెరికా అంటే అర్థం తెలియదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా రిపబ్లికన్‌ పార్టీ సహచరుడు, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ఆయన చురకలంటించారు. అమెరికా ఆదర్శాలను అవగాహన చేసుకోవడమే ఇలాంటి సమస్యలకు పరిష్కారం అని బుష్  ప్రకటన వెలువడిన కాసేపటికే ట్రంప్‌ ఓ ట్వీట్‌ చేశారు. అబ్రహం లింకన్‌ తర్వాత నల్లజాతీయుల సంక్షేమం కోసం తాను తీసుకున్న చర్యలు ఏ అధ్యక్షుడూ తీసుకోలేదని వ్యాఖ్యానించారు. తన హయాంలో చేపట్టిన వివిధ కార్యక్రమాలను ఏకరువు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: