కొన్ని రోజుల క్రితం అంఫన్ తుఫాన్ మిగిల్చిన విషాదం మరవక ముందే నిసర్గ రూపంలో మరో తుఫాను ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. మరో తుఫాను ముప్పు పొంచి ఉందని వార్తలు రావడంతో నిన్నటినుంచి ముంబై నగరవాసులు భయాందోళనకు గురయ్యారు. అయితే దేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిసర్గ తుఫాను ముప్పు తప్పింది. తుఫాను మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలో దిశను మార్చుకుని ఉరణ్, పుణే, నాసిక్ మీదుగా ముందుకు వెళ్లిపోయింది. 
 
తుఫాను ముప్పు లేదని తెలియడంతో ముంబై వాసులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు, ముంబైలో భారీ వర్షం కురవకపోయినా బలమైన ఈదురుగాలులు వీచటంతో పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. తుఫాను వల్ల రాయిగఢ్, రత్నగిరి జిల్లాలో భారీస్థాయిలో నష్టం వాటిల్లింది. ఈదురు గాలులకు పలు గ్రామాల్లో ఇళ్లు, భవనాల పై కప్పులు గాలికి కొట్టుకుపోయాయి. తుఫాను వల్ల ఇద్దరు మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. 
 
నిసర్గ తుఫాన్ వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించలేదని గుజరాత్ రాష్ట్రంలోని అధికారులు తెలిపారు. నిసర్గ రూపంలో మరో తుఫాను ముప్పు ఉందని మూడు రోజుల నుంచి వార్తలు వచ్చినా తుఫాను బలహీనపడటంతో భారీ ముప్పు తప్పింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు అండమాన్, నికోబార్ దీవులతో పాటు బంగాళఖాతంలోని కొన్ని ప్రాంతాలకు క్రమంగా విస్తరిస్తున్నాయి. 
 
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో నిన్న ఎండ, వేడి గాలులు కొంచెం తగ్గాయి. రాష్ట్రంలో 32 డిగ్రీల నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న సాయంత్రానికి ఉష్ణోగ్రతలు చల్లబడి పలు ప్రాంతాల్లో చెదురుముదురుగా వర్షాలు పడ్డాయి. వాతావరణ శాఖ గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమలోని అనేక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. నిసర్గ తుఫాను ఈశాన్యంగా పయనించి ఈరోజు రాత్రికి బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: