టపాకాయల్లో ఉపయోగించే పేలుడు పదార్థాలు నింపిన పైనాపిల్‌ను తినిపించడంతో గర్భంతో ఉన్న ఓ ఏనుగు మృతి చెందిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలో సైలెంట్‌ వ్యాలీ నేషనల్‌ పార్కులోని వెల్లియార్‌ నది వద్ద మే 27వ తేదీన జరిగిన ఈ దారుణ ఘ‌ట‌న‌పై  తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గుర్తు తెలియని దుండగుడు ఇచ్చిన పైనాపిల్‌ ఏనుగు గొంతులో పేలిపోయింది. అడవుల్లో ఏనుగులను వేటాడే ముఠా ఈ హత్యకు పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ దారుణాన్ని మోహన్‌ కృష్ణన్‌ అనే అటవీ అధికారి వెలుగులోకి తీసుకొచ్చారు. గర్భిణి ఏనుగు మరణించిన తీరును, ఫొటోలను ఆయన తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. ఏనుగు తల నీటిలో కూరుకుపోయిందని పేర్కొన్నారు. మూగ జీవాన్ని రాక్షసంగా చంపేసిన దుండగుడిని గుర్తించి, అదుపులోకి తీసుకోవాలని కేరళ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని స్పష్టం చేసింది.

 

అలాగే.. గర్భిణీ ఏనుగును చంపిన అమానవీయ, దారుణ ఘ‌ట‌న‌పై కేంద్ర ప్ర‌భుత్వం సీరియ‌స్ అయింది. గురువారం సమగ్ర నివేదికను కోరింది. కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందించారు. ఏనుగు హత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కేసును అటవీ శాఖ దర్యాప్తు చేస్తోందని, నిందితులకు శిక్ష పడుతుందని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే... లోక్‌సభ ఎంపీ, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ కూడా స్పందించారు. కేర‌ళ‌లో జంతువుల హ‌త్యలు నిరంత‌రం జ‌రుగుతున్నాయ‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. దుండ‌గుల‌పై కేర‌ళ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌డం లేద‌ని ఆగ్రహం వ్య‌క్తం చేశారు. అలాగే ఈ దారుణ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా సామాన్యుల నుంచి ప్ర‌జాప్ర‌తినిధులు, సెల‌బ్రిటీలంద‌రూ స్పందిస్తున్నారు. నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: