ఆంధ్రప్రదేశ్ కు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జగన్ తన ఏడాది పాలనలో పరిశ్రమలు, పెట్టుబడులపై పెద్దగా దృష్టి పెట్టలేదు అన్న విమర్శ ఉంది. అయితే ఇటీవలే రాష్ట్రంలోని కియా ఫ్యాక్టరీ విస్తరించనున్నట్టు ప్రకటించింది. ఇక ఇప్పుడు మరో పారిశ్రామిక దిగ్గజం కూడా ఇదే బాటలో పయనిస్తోంది.

 

 

తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించినట్టు తెలిసింది. ఫాక్స్ కాన్ ను మొబైల్ ఫోన్ల రంగంలో మంచి పేరుంది. ఈ సంస్థకు ఇప్పటికే శ్రీ సిటీలో ఓ యూనిట్ ఉంది. ఇప్పుడు ఈ యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుతామని ఫాక్స్‌కాన్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్‌ ఇండియా ఎండీ, కంట్రీ హెడ్‌ జోష్‌ ఫౌల్గర్‌ ప్రకటించారు.

 

 

కోవిడ్‌ తర్వాత వచ్చే ఐదేళ్లలో దేశీయ ఎలక్ట్రానిక్‌ మార్కెట్‌ విలువ 400 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని జోష్‌ ఫౌల్గర్‌ అంటున్నారు. ఈ అవకాశాన్ని ఏపీ అందిపుచ్చుకోవాలని సూచించారు. కరోనా తర్వాత ఎలక్ట్రానిక్స్‌ తయారీ రంగంలో అవకాశాలపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇన్వెస్ట్‌ ఇండియా ఈఐఎఫ్‌ – 2020 పేరిట నిర్వహించిన వెబ్‌నార్‌లో జోష్‌ ఫౌల్గర్‌ ఈ ప్రకటన చేశారు.

 

 

ఇదే సమయంలో జోష్‌ ఫౌల్గర్‌ ఏపీ సర్కారు పనితీరును మెచ్చుకున్నారు. శ్రీ సిటీలోని ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించడానికి వేగంగా అనుమతులు మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడిలోనూ చురుగ్గా పని చేసిందని కితాబిచ్చారు. కరోనా సమయంలో పారిశ్రామిక రంగం త్వరగా కోలుకునే విధంగా ఏపీ సర్కారు మంచి చర్యలు తీసుకుందని జోష్ ఫౌల్గర్ మెచ్చుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: