ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అర్హులైనా రేషన్ కార్డులు రాలేదని ప్రభుత్వం దృష్టికి రావడంతో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పేదలకు ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులను అందిచేలా అధికారులు ప్రణాళికను రూపొందించగా సీఎం జగన్ నూతన విధానానికి ఆమోదం తెలిపారు. ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రేషన్ కార్డులు పొందే సదుపాయం కల్పించారు. 
 
ఈ నెల 6వ తేదీ నుంచి ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తీసుకురానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు ప్రభుత్వం రాష్ట్రంలో రేషన్ డోర్ డెలివరీ దిశగా చర్యలు చేపడుతోంది. ప్రభుత్వం రేషన్ డోర్ డెలివరీలో భాగంగా త్వరలో ఉచితంగా బియ్యం సంచులను పంపిణీ చేయనుంది. ప్రభుత్వం ఇందులో భాగంగా ప్రతి ఇంటికి 10, 15 కిలోల చొప్పున 12 సంచులను కార్డుదారులకు అందించనుంది. 
 
ప్రభుత్వం ఒక్కో సంచి తయారికి 25 రూపాయలు ఖర్చు చేయనున్నట్టు తెలుస్తోంది. రేషన్‌ సరుకుల పంపిణీలో ఇబ్బందులను అధిగమించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అర్హులైన వారికి రేషన్‌ కార్డు కావాలంటే.. 5 రోజుల్లో మంజూరు చేస్తామని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేయగా తాజాగా జగన్ సర్కార్ ఆ దిశగా చర్యలు చేపడుతోంది. ఏపీలో కరోనా రాకాసి విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో జగన్ సర్కార్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. 
 
మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 79 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3279కు చేరింది. వీరిలో 2244 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా ప్రస్తుతం 967 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గడచిన 24 గంటల్లో నలుగురు మృతి చెందగా కరోనా మృతుల సంఖ్య 68కు చేరింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: