ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వేకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మనుషులకు ప్రస్తుతం ఏ విధంగా ఆధార్ కార్డులు ఉన్నాయో అదే విధంగా భూములకు కూడా గుర్తింపు ఉండేలా భూధార్ కార్డులు ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి నుంచి ఈ మేరకు జీవో జారీ అయింది. ఇకనుండి రాష్ట్రంలోని భూములకు భూధార్ నంబర్ ను అధికారులు కేటాయించనున్నారు. 
 
అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటివ్ రిఫరెన్స్ స్టేషన్స్(కార్స్) అనే టెక్నాలజీని వినియోగించి రాష్ట్రంలో భూముల సర్వే చేయడం జరుగుతుంది. ప్రభుత్వం తొలి దశలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో రీసర్వే చేయనుంది. ఈ ఆర్ధిక సంవత్సరం బడ్జెట్‌లో ప్రభుత్వం ఇందుకోసం 200.15 కోట్ల రూపాయలను ఇందుకోసం ఖర్చు చేయనుందని తెలుస్తోంది. రాష్ట్రంలో 120 సంవత్సరాల తరువాత భూముల సమగ్ర రీ సర్వేకు సీఎం నిర్ణయం తీసుకున్నారు. 
 
మనుషులకు ఆధార్ విశిష్ట సంఖ్య ఉన్న విధంగా ప్రతి ల్యాండ్ బిట్ కు భూదార్ నంబర్ ను కేటాయిస్తారు. ప్రభుత్వం తొలుత 5 గ్రామాల పరిధిలోగల 66,761 ఎకరాల భూములను రీసర్వే చేయనున్నట్టు తెలుస్తోంది. రీ సర్వే కోసం అవసరమైన కొన్ని పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సర్వే డైరెక్టర్ నుంచి ప్రభుత్వానికి వినతులు అందాయి. సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో, కొలతల్లో ఏ మాత్రం లోపం లేనివిధంగా రీసర్వే పనులు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. 
 
రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి అన్ని రంగాలపై దృష్టి పెట్టారు. అర్హులైనా రేషన్ కార్డులు లేకపోతే ఐదు రోజుల్లోనే రేషన్ కార్డులు అందేలా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,200 దాటగా మృతుల సంఖ్య 68 దాటింది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: