మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. నష్టాల నుంచి తేరుకుంటున్న సమయంలోనే లాక్ డౌన్ రూపంలో.. పెద్ద దెబ్బపడింది. 660 కోట్ల రూపాయల ఆదాయం కోల్పోయింది. 55 రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కినా... ఆక్యుపెన్సీ 40శాతం దాటడం లేదు. దీంతో ప్రగతి చక్రం గాడినపడేందుకు.. ఎంతకాలం పడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

 

సుదీర్ఘ సమ్మె తర్వాత ఆర్టీసీని పూర్తి ప్రక్షాళన చేసిన కేసీఆర్‌... నష్టాల నుంచి తేరుకునేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నష్టాల నుంచి తేరుకునేలా సంక్షేమ మండలిని ఏర్పాటు చేశారు. అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా పనిచేయడం ప్రారంభించారు. టికెట్ ధరలు పెంచి.. ఆదాయమూ సమకూరడం మొదలైంది. ఇక ఆర్టీసీకి అన్నీ మంచిరోజులే అనుకున్నారు. ఇంతలోనే కరోనా కాటేసింది. లాక్‌డౌన్‌ రూపంలో భారీ షాక్‌ ఇచ్చింది. లాక్ డౌన్ కు ముందు 70 శాతానికి ఉన్న ఆక్యుపెన్సీ ఇప్పుడు.. సగం కూడా లేదు. దీంతో కథ మళ్లీ మొదటికొచ్చింది.

 

దాదాపు రెండు నెలల తర్వాత రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సుల్లో.. ప్రస్తుతం 28 శాతం మాత్రమే ఓఆర్‌ నమోదవుతోంది. ఒక్కసారిగా 42శాతం ఆక్యుపెన్సీ రేటు పడిపోయింది. కొవిడ్‌ నియంత్రణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఆక్యుపెన్సీ పెరగడం లేదు. ప్రస్తుతం ఆర్టీసీలో సుమారు 5వేల బస్సులు మాత్రమే నడుస్తున్నాయి. సుమారు 1,200కు పైగా అంతరాష్ట్ర బస్సులు, 3,500లకు పైగా గ్రేటర్ ఆర్టీసీ బస్సులు ఇంకా రోడ్డెక్కలేదు. ప్రస్తుతం నడుస్తున్న ఐదువేల బస్సులతో వస్తున్న ఆదాయం.. మెయింటెనెన్స్‌కే సరిపోతోంది. రోజూ సుమారు 12 కోట్ల రూపాయల పొందే ఆర్టీసీ.. గత రెండునెలల్లలో 660 కోట్ల రూపాయలు కోల్పోయింది. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులకు, సిబ్బందికి 50శాతం జీతాలను.. నాల్గో తరగతి ఉద్యోగులకు, కాంట్రాక్టు సిబ్బందికి 90శాతం జీతం చెల్లిస్తోంది ఆర్టీసీ. 

 

అంతర్ రాష్ట్ర సర్వీసులకు కేంద్రం అనుమతి ఇచ్చినా... ఇంకా తెలంగాణ సర్కార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌.. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. సరిహద్దుల్లో ఏవిధంగా వ్యవహరించాలి?  పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు బస్సులు నడపాలంటే ఎలాంటి నిబంధనలు పాటించాలనే అంశాలపై చర్చించారు. ఇక ఈనెల 8న కేంద్రం విధించిన లాక్డౌన్‌ ముగుస్తుండటంతో పాటు.. పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో గ్రేటర్ తో పాటు, అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను నడిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కోవిడ్ -19 నిబంధనలు పాటిస్తూ ఓఆర్ పెంచుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు అధికారులు. అయితే, ఆర్టీసీ మళ్లీ ఎప్పుడు ప్రాఫిట్‌ ట్రాక్‌లోకి రావడానికి సమయం పట్టే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: