ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా వైరస్ విజృంభణ వల్ల చైనా వార్తల్లో నిలుస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 65 లక్షల మందికి సోకింది. ప్రపంచ దేశాలన్నీ కరోనా విజృంభణ వల్ల చైనాపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నాయి. చైనాపై ప్రత్యక్షంగా విమర్శలు చేయనప్పటికీ భారత్ స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యత ఇవ్వాలని ఇప్పటికే పిలుపునిచ్చింది. 
 
ఇదే సమయంలో భారత్ చైనా సరిహద్దు వివాదం నెలకొనడంతో మన దేశంలోని నెటిజన్లు టిక్ టాక్ యాప్ కు భారీ షాక్ ఇచ్చారు. టిక్ టాక్ యాప్ రేటింగ్లను గూగుల్ ప్లే స్టోర్ లో తగ్గించారు. అదే సమయంలో అవే ఫీచర్లతో పని చేసే ఇతర యాప్స్ పట్ల నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. చైనా యాప్ కు పోటీగా వచ్చిన దేశీయ యాప్ మిత్రోను ఏకంగా అరకోటి మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ కు తక్కువ రేటింగ్స్ ఇవ్వడంతో యాప్ రేటింగ్ 4.7 నుంచి 1.7కు కు పడిపోయింది. 
 
భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా భారీ స్థాయిలో మిత్రో యాప్ డౌన్ లోడ్స్ జరిగాయి. అయితే ఈ పరిణామాల అనంతరం గూగుల్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మొదట టిక్ టాక్ యాప్ కు ఒక స్టార్ ఇచ్చిన రేటింగులన్నింటినీ తొలగించింది. దీంతో టిక్ టాక్ యాప్ రేటింగ్ పెరిగింది. అదే సమయంలో టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిత్రో యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. దీంతో షాక్ అవ్వడం మిత్రో యూజర్ల వంతయింది. 
 
మిత్రో యాప్ ను ప్లే స్టోర్ నుంచి తొలగించడానికి గల కారణాలను కూడా గూగుల్ వెల్లడించలేదు. దీంతో భారతీయ యాప్ మిత్రోను అడ్డుకోవాలని గూగుల్ ప్రయత్నిసోందా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్దంగా మిత్రో యాప్ ఉందంటూ గూగుల్ చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మిత్రో యాప్ నిర్వాహకులు గూగుల్ ను సవాల్ చేస్తూ, తాము గూగుల్ నియమావళిని ఉల్లంఘించలేదని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: