దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు పదో తరగతి పరీక్షలు నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. తెలంగాణలో ఈ నెల 8 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా ఏపీలో జులై నెలలో పరీక్షలు జరగనున్నాయి. 
 
ఇదే సమయంలో కర్ణాటక రాష్ట్రంలోని సోషల్ మీడియాలో విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులను డైరెక్ట్ గా ప్రమోట్ చేయాలని... పరీక్షలు నిర్వహించకూడదని డిమాండ్లు వినిపించాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్నాయి. "ప్రమోట్ స్టూడెంట్స్ సేవ్ ఫ్యూచర్" పేరుతో హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేస్తున్నారు. పరీక్షలు వద్దని ప్రచారం చేస్తున్నారు. 
 
మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు పరీక్షలను రద్దు చేసింది. కర్ణాటకలో ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ఆటోమేటిక్ గా ప్రమోట్ చేయండని విద్యార్థులు చేస్తున్న డిమాండ్ తెలుగు రాష్ట్రాలకు పాకింది. పలు రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షల రద్దు దిశగా చర్యలు చేపట్టాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పదో తరగతితో పాటు ఇతర పరీక్షలకు తేదీలను ప్రకటించాయి. 
 
అందువల్ల ప్రభుత్వాలు విద్యార్థుల డిమాండ్లను పరిగణనంలోకి తీసుకునే అవకాశాలు తక్కువ. అయితే సోషల్ మీడియాలో హాష్ ట్యాగ్ వైరల్ అవుతూ ఉండటంతో జగన్ , కేసీఆర్ ఈ డిమాండ్ పట్ల స్పందిస్తారేమో చూడాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల్లో ప్రతిరోజూ భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు నమోదైన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి.                 

మరింత సమాచారం తెలుసుకోండి: