సంక్షేమబాట కొనసాగిస్తోంది ఏపీ ప్రభుత్వం. కరోనా కష్టకాలంలోనూ రెండో ఏడాది వాహన మిత్ర లబ్ధిదారులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి.. సాయమందించారు.. వాహనమిత్ర సాయమందించడపై.. ఆటోవాలాలు ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

 

ఓ వైపు ఆర్థికలోటు.. మరోవైపు కరోనా కష్టకాలం..అయినా ప్రజలకిచ్చిన హామీలను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో .. రెండో విడత వైఎస్సార్ వాహన మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి 262 కోట్ల 49 లక్షల రూపాయలను ... నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అనంతరం ఆటో,ట్యాక్సీవాలలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ మాట్లాడారు.

 

ఆటో, ట్యాక్సీ ఉన్న 2లక్షల 62 వేల 493 మంది లబ్దిదారులకు.. రెండోవిడతగా 10వేలు ఆర్ధిక సాయం అందనుంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 37 వేల756 మంది లబ్ధిదారులను అదనంగా రవాణా శాఖ ఎంపిక చేసింది. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం వైఎస్సార్‌ వాహన మిత్ర లబ్ధిదారులకు అక్టోబర్‌లో పది వేలు ఇవ్వాల్సి ఉంది. అయితే కరోనా కష్టాలను దృష్టిలో పెట్టుకుని నాలుగు నెలల ముందుగానే సాయం విడుదల చేయనున్నారు. ఎనిమిది కార్పొరేషన్ల ద్వారా రెండో ఏడాది ఆర్థిక సాయాన్ని విడుదల చేశారు. కొత్తగా ఆటోలు కొన్నవారికీ వాహన మిత్ర పథకాన్ని వర్తింపజేశారు. గతేడాది సెప్టెంబరు 23 నుంచి ఈ ఏడాది మే 16 వరకు వాహనాల కొనుగోలు, యాజమాన్య బదిలీ హక్కులు పొందిన వారిని అర్హులుగా ఎంపిక చేశారు. ఎవరికైనా డబ్బులు రాకుంటే ఆందోళన చెందొద్దని స్పందన వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు సీఎం జగన్‌.

 

సుదీర్గ పాదయాత్రలో ఆటో,ట్యాక్సీవాలాల కష్టాలు విన్నానని.. అప్పుడే వాటిపై సానుభూతితో వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు జగన్ తెలిపారు..రోజుకు మూడు వందలు సంపాదించుకునే ఆటోడ్రైవర్లు.. చలానాలు, ఇతర ఫెనాల్టీలను ఎలా కట్టగలరన్నారు సీఎం జగన్... వారిని ఆదుకోవాలనే .. వాహనమిత్రను తెచ్చామన్నారు.

 

గత ప్రభుత్వాల హయాంలో మాటలే కానీ .. తమకు ఏనాడు సాయమందలేదని పలువురు ఆటో, ట్యాక్సీవాలాలు తెలిపారు. జగనన్న సర్కార్ వచ్చిన తర్వాతే గుండెలపై చేయి వేసుకుని నిద్రపోగలుగుతున్నామన్నారు. నాన్నగారి తర్వాత మా గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయే ముఖ్యమంత్రి మీరేనయ్యా అంటూ ఉద్వేగానికి లోనయ్యారు ఆటోడ్రైవర్లు. ఆటోడ్రైవర్లకు వెల్ఫేర్ బోర్డ్, ప్రభుత్వ ఇన్స్యూరెన్స్, గుర్తింపు కార్డు ఇవ్వాలని మరికొందరు ఆటోడ్రైవర్లు.. సీఎం జగన్ కు సూచించారు. ఇవి అందిస్తే.. తమ జీవితాలు కుదుటపడతాయన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: