ఏపీలో కరోనా గుబులు రేపుతోంది. లాక్‌డౌన్ సడలింపుల వేళ తాజా లెక్కలు కలవరపెడుతున్నాయ్. వైరస్ వ్యాప్తి పెరిగిందా..? లేక అధిక సంఖ్యలో టెస్ట్‌లు చేయడం వల్ల కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయా అనే గందరగోళంలో ఉన్నారు అధికారులు. మరోవైపు సచివాలయంలోని కరోనా కేసులు కలవరపెడుతున్నాయి.

 

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలుగు రాష్ట్రాలు కాస్త సేఫ్‌గా అనిపించినా, లాక్‌ డౌన్‌ తర్వాత సీన్‌ మారుతోంది. ఏపీలో వేగంగా కేసులు పెరుగుతున్నాయి. గతంలో సేఫ్‌గా ఉన్న ప్రాంతాల్లో కరోనా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది. గడచిన 24 గంటల్లో 9,986 మంది నమూనాలు పరీక్షించగా.. 141 కేసులు నిర్ధారణ అయ్యాయ్. అయితే, వీటిలో విదేశాలు, పొరుగు రాష్ట్రాలకు చెందిన వారివే 43 ఉండగా.. 98 లోకల్‌ పాజిటివ్‌ కేసులు వచ్చాయ్‌. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 వేల
377కి చేరింది. గత 24 గంటల్లో మరో ముగ్గురు కరోనాతో చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 71కి చేరింది.

 

రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో 19 మందికి కోయంబేడు లింకులున్నాయ్. 2 వేల 273 మంది వైరస్‌ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. ప్రస్తుతం ఒక వెయ్యి 33 యాక్టివ్‌ కేసులున్నాయ్. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం రేపుతోంది. ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు వైరస్ బారినపడుతున్నారు. ముందు జాగ్రత్తగా అందరినీ క్వారెంటైన్‌లో పెట్టినా కొంతమందికి కోరనా సోకుతుంది. జిల్లాలో ఒకే కుటుంబంలో ఆరుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది.

 

మరోవైపు ఏపీ సచివాలయంలోనూ కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ముగ్గురు ఉద్యోగులకు కోరోనా సోకినట్టు గుర్తించారు. వ్యవసాయ శాఖ ఉద్యోగి నుంచి జేఏడీ, రెవిన్యూ శాఖలకు చెందిన మరో ఇద్దరు ఉద్యోగులకు కరోనా వ్యాపించినట్టు నిర్ధారించారు. కరోనా కేసులు రావడంతో వ్యవసాయశాఖ, సహకార శాఖల్లోని ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోంకు అనుమతి ఇచ్చారు.

 

అనంతపురం జిల్లాలోని కియా కార్ల కంపెనీ ఉద్యోగికి కరోనా నిర్ధారణ అయింది. కంపెనీలో పనిచేస్తున్న 545 మందికి పరీక్షలు నిర్వహించగా.. ఓ ఉద్యోగికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ ఉన్న వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు.పాజిటివ్ ఉన్న వ్యక్తి కాంటాక్టులను గుర్తించే పనిలో పడ్డారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: