సోనూసూద్ సంగతి మనం వినే ఉంటాం.. సినిమాల్లో విలన్ అయినా.. వలస కూలీల కోసం లక్షలకు లక్షలు ఖర్చు చేసి వారిని స్వస్థలాలకు పంపి.. సోషల్ మీడియా హీరో అయ్యాడు. అయితే అలాంటి హీరోలు మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నారు. హైదరాబాద్ మేడ్చల్ రింగ్ రోడ్ వద్ద.. ఇండస్ మార్టిన్, అతని స్నేహ బృందం చేసిన సాయం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

 

మరి ఇంతకీ ఈ ఇండస్ మార్టిన్ ఏం చేశాడు.. వలస కూలీల కష్టాలు చూసి చలించిపోయి.. మొదటి రోజు రూ. 20 వేల రూపాయలు ఖర్చు చేసి చెప్పులు కొని వలస కూలీలకు పంచాడు. అక్కడ చూస్తే వందల మంది వలస కూలీలు కనిపించారు. వీళ్లకు చెప్పులు ఇస్తే ఏమవుతుంది.. మనం ఇంత కంటే ఎక్కువగా ఏమీ చేయలేమా అని ఆలోచించాడు. వాళ్లను ఇళ్లకు బస్సుల్లో పంపాలంటే.. చాలా డబ్బు కావాలి.. వేలు, లక్షలు అవుతుంది. అతనికి ఫేస్ బుక్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో సేవాకార్యక్రమాలు చేసిన అనుభవం ఉంది.

 

అంతే వెంటనే ఫేస్ బుక్ లో పరిస్థితి వివరిస్తూ పోస్టు పెట్టాడు. అతని ఫేస్ బుక్ స్నేహబృందం కొందరు జత కలిశారు. ఇక అక్కడ నుంచి వారం రోజులు ఇండస్ మార్టిన్, అతని స్నేహ బృందం మకాం అక్కడే. బస్సులు మాట్లాడుకోవడం.. పర్మిషన్లు తీసుకోవడం.. వలస కూలీలను వాళ్ల సొంత రాష్ట్రాలకు పంపడం.. ఇదే పని.. అక్కడే వలస కూలీల కోసం ఓ క్యాంప్ నిర్వహించారు ఇతని మిత్ర బృందం. అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు.

 

( బాలింత కోసం ప్రత్యేకంగా కారు )

అలా వారం రోజుల్లో వందల మంది వలస కూలీలను వాళ్ల సొంత రాష్ట్రాలకు పంపారు. గర్భిణులు, బాలింతలనైతే.. కార్లు మాట్లాడి మరీ పంపారు. ఇదంతా కేవలం ఫేస్ బుక్ లో పోస్టుల ద్వారానే సాధ్యమైంది. దాతల నుంచి తీసుకున్న ప్రతి రూపాయికీ ప్రతి రోజూ ఫేస్ బుక్ లోనే లెక్క చూపించేవారు. కరోనా కాలంలో వలస కూలీల మధ్య వారం రోజులు ఉండి.. వాళ్ల కోసం తపించి.. వందల మందిని ఇళ్లకు చేర్చిన ఇండస్ మార్టిన్ మన తెలుగు సోనూసూద్ కాదంటారా..? ఇది ఒక్కడి విజయం కాకపోవచ్చు. కానీ తొలి అడుగు ఎప్పుడైనా ఆ ఒక్కడిదేగా..?

 

‍ ( దాతల వివరాలు.. )

 

( వలస కార్మికులను పంపిన తర్వాత )

 

మరింత సమాచారం తెలుసుకోండి: