క‌రోనా వైర‌స్ వ్యాప్తికి సంబంధించి రోజుకో కొత్త విష‌యాలు వెలుగుచూస్తున్నాయి. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరీతిలో వైర‌స్ ప్ర‌భావం ఉన్న‌ట్లు ప‌రిశోధ‌న‌ల్లో తేలుతోంది. కరోనా జన్యుక్రమంలో మార్పులపై హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ)  డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా నేతృత్వంలో గత నెల రోజులుగా జీనోమ్‌ సీక్వెన్సీ పరిశోధనలు కొన‌సాగుతున్నాయి. ఇందుకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ ల్యాబ్‌ కూడా కొంత సహకారమందించింది. ఇప్పటివరకు వందకు పైగా  వైరస్‌ నమూనాల జన్యువులను వేరు చేసి పరిశీలించారు. ఈ పరిశోధనలలో కరోనా జన్యువులలో తేడాలను గ్రహించగలిగారు.  భార‌త‌దేశంలో విస్తరిస్తున్న వైరస్‌ ప్రధానంగా రెండు రకాలుగా ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్‌, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ర్టాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని, అక్కడి వైరస్‌ మ్యుటేషన్‌లో తేడా ఉందని చెప్పారు. ఇక్కడ ప్రబలుతున్న కరోనా జన్యువు అమెరికా, చైనా, ఇటలీ దేశాలలోని కరోనా జన్యువుతో సరిపోలుతున్నట్లు  గుర్తించారు.

 

ఈ క్ర‌మంలోనే  భార‌త్‌లో ఉత్తర, దక్షిణాన‌ వేర్వేరు తీవ్రతలతో క‌రోనా వైర‌స్‌ ఉన్నట్టు జరుపుతున్న పరిశోధనల్లో వెల్ల‌డైంది. ఉత్తరాదిలో కేసులు భారీగా నమోదవుతుండగా, దక్షిణాదిలో ఆ సంఖ్య తక్కువగా ఉన్నది. దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ బలహీనంగా ఉండటం వల్లనే మరణాల రేటు కూడా చాలా తక్కువగా ఉన్నదని సీసీఎంబీ వ‌ర్గాలు అంటున్నాయి. తెలంగాణ, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో ప్రబులుతున్న వైరస్‌కు, మహారాష్ట్ర, గుజరాత్‌, ఢిల్లీ వంటి రాష్ర్టాలలో విస్తరిస్తున్న వైరస్‌కు స్పష్టమైన తేడా ఉన్నట్టు సీసీఎంబీ జరుపుతున్న ‘జీనోమ్‌ సీక్వెన్సీ’ పరీక్షలలో స్పష్టమ‌వుతోంది. దక్షిణాదిలో మనుగడులో ఉన్న వైరస్‌కు ‘ఏ3ఏ’గా, ఉత్తర భారతంలో విజృంభిస్తున్న వైరస్‌కు ‘ఏ2ఏ’గా పేరుపెట్టారు. ఈ రెండు వైరస్‌లలో స్పష్టమైన తేడా ఉన్నట్టు తమ జన్యు క్రమ పరీక్షలలో తేలిందని పరిశోధకులు పేర్కొన్నారు. దక్షిణాదిలో ప్రబలుతున్న వైరస్‌ సింగపూర్‌, ఫిలిప్పీన్స్‌లో వ్యాప్తి చెందుతున్న క‌రోనా వైరస్‌ జన్యుక్రమం ఒక్కటిగా ఉన్నదని ప‌రిశోధ‌కులు నిర్ధారించారు. అయితే.. ఈ వైరస్ చాలా‌ బలహీనంగా ఉన్నదని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో మరణాల రేటు తక్కువగా ఉండటానికి ఇది ఒక కారణమని వెల్లడించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: