ప్రస్తుతం దేశంలో కరోనా విజృంభణతో పాటు భారత్ చైనా వివాదం గురించి చర్చ జరుగుతోంది. సరిహద్దు ప్రాంతంలో వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. నిన్న సాయంత్రం సెక్యూరిటీ ఏజెన్సీలు కేంద్ర ప్రభుత్వానికి కీలక నివేదికలను సమర్పించగా ఆ నివేదికలలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ నివేదికలలో చైనా ఆక్రమణలకు సంబంధించిన సంచలన అంశాలు ఉన్నాయని ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. 
 
భారత్ మూడు ముఖ్య స్థావరాలను కోల్పోయిందని... ప్రస్తుతానికి భారత్ పై చైనా పైచేయి సాధించిందని కథనం వెలువడింది. గత నెలలో సరిహద్దు ప్రాంతంలో పెద్దఎత్తున బలగాలను మోహరించిన చైనా లడఖ్ సెక్టార్ లోని మూడు ప్రాంతాలలో చొచ్చుకొని రావడానికి ప్రయత్నించిందని... భారత సైన్యం వెంటనే అప్రమత్తం కావడంతో చైనాను మరింత ముందుకు రాకుండా చేయడంలో సక్సెస్ అయిందని పేర్కొంది. 
 
వాస్తవ నియంత్రణ రేఖ దగ్గర 50 కిలోమీటర్ల భూభాగాన్ని గత నెల తొలి వారంలోనే చైనా ఆక్రమించిందని.... నిన్నటికి కూడా సదరు భూభాగం చైనాలోనే ఉందని తెలుస్తోంది. గాల్వాన్ లోయలో సైతం చైనా పెద్దఎత్తున కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. చైనా ఆక్రమణల గురించి కేంద్రం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మీడియాలో మాత్రం చైనా ఆక్రమణలకు సంబంధించిన కథనాలు వస్తున్నాయి. 
 
ఇప్పటికే చైనా కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం వల్ల చర్చల ప్రక్రియ విషయంలో బెట్టు చూపుతున్నట్టు తెలుస్తోంది. చైనా ఇప్పటికే సరిహద్దు దగ్గర సైన్యాన్ని, యుద్ధవిమానాలను, ఆయుధసంపత్తిని మోహరించింది. భారత్ సరిహద్దులో రోడ్డుతో పాటు నిర్మిస్తున్న వంతెనలను ఆపాలని చైనా ప్రయత్నిస్తుండగా భారత్ మాత్రం వీటి విషయంలో వెనక్కు తగ్గబోమని చెబుతోంది. కింది స్థాయి అధికారుల మధ్య ఇప్పటికే జరిగిన చర్చలు విఫలం కాగా రేపు లెఫ్టినెంట్ జనరల్ స్థాయిలో చర్చ జరగనుంది. ఆర్మీ చీఫ్ నరవణే సరిహద్దు పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని రక్షణ మంత్రి రాజ్ నాథ్ కు తెలియజేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: