ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాలకు చెందిన వారికి, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులను నడపనుంది. ఐదో విడత లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్రం అంతర్రాష్ట్ర ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి అంతర్రాష్ట్ర సర్వీసులను నడపడానికి రంగం సిద్ధమవుతోంది. 
 
రాష్ట్ర ప్రభుత్వం బస్సులు తిప్పడానికి అనుమతులు ఇవ్వాలని పొరుగు రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. సీఎస్ నీలం సాహ్ని తమిళనాడు మినహా ఒడిశా, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఏపీఎస్ ఆర్టీసీ ఇతర రాష్టాలకు బస్సులకు నడపడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి పెద్ద సంఖ్యలో వస్తున్న వారికి రాష్ట్ర సరిహద్దులో తనిఖీలు జరుగుతున్నాయి. వీరి వివరాలను సేకరించడంలో అధికారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 
 
ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యల్లో ప్రైవేట్ వాహనాల్లో ప్రజలు వస్తూ ఉండటంతో జిల్లా కలెక్టర్లు వివరాల సేకరణ కష్టంగా ఉందని... అంతర్రాష్ట్ర సర్వీసులను ప్రారంభించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. నాలుగో విడత లాక్ డౌన్ నిబంధనల మినహాయింపు అనంతరం తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు 13,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ వీరి కోసం బస్సులు తిప్పడానికి ప్రయత్నించినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు. 
 
తెలంగాణ ప్రభుత్వం అంతర్రాష్ట్ర ప్రయాణికులను రాష్ట్రంలోకి అనుమతిస్తోంది. కానీ ఇతర రాష్ట్రాల బస్సుల విషయంలో తెలంగాణ స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. తమిళనాడు రాష్ట్రం బస్సుల విషయంలో స్పష్టమైన విధానాన్ని ప్రకటించలేదు. ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు వస్తే సోమవారం నుంచి రాష్టంలో ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.              

మరింత సమాచారం తెలుసుకోండి: