తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతిపాదిత బిల్లుతో విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతుందని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాల అభిప్రాయం కావాలని కేంద్రం కోరగా కేసీఆర్ లేఖ ద్వారా సవరణ బిల్లుపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. 
 
లేఖ అనంతరం మీడియాలో కేంద్రం విద్యుత్ ను ప్రైవేట్ పరం చేయనుందని కథనాలు వెలువడుతున్నాయి. కేంద్రం విద్యుత్ సవరణ బిల్లు ద్వారా ప్రైవేటీకరణ చేయనుందా...? సంస్కరణ చేయనుందా...? అనే ప్రశ్నలు వ్యక్తమవుతూ కొత్త చర్చకు దారి తీస్తున్నాయి ప్రస్తుతం రాష్ట్రాలకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునే అధికారాలు ఉన్నాయి. 2014లో ఏపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కొన్ని విదేశీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. 
 
జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఒప్పందాల గురించి సమీక్ష నిర్వహించి ఒప్పందాల రద్దు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విద్యుత్ ఒప్పందాల విషయంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారిన ప్రతి సందర్భంలో సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే కేంద్రం తీసుకొచ్చే సవరణ చట్టం ద్వారా రాష్ట్రాలు కేంద్రానికి డబ్బులు జమ చేస్తే ఆ మేరకు విద్యుత్ రాష్ట్రానికి అందేలా జరుగుతుంది. 
 
ఈ చట్టం అమలులోకి వస్తే గృహ వినియోగదారులు తాము వినియోగించే ప్రతి యూనిట్‌కు పూర్తిస్థాయి బిల్లును చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్‌ బిల్లుపై సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వినియోగదారులు శ్లాబ్‌ ఆధారంగా లభించే సబ్సిడీని పొందుతూ బిల్లులు చెల్లిస్తున్నారు. కేంద్రం రూపొందించిన బిల్లు అమలులోకి వస్తే సబ్సిడీలు రద్దవుతాయి. ఇప్పటివరకూ సబ్సిడీని పొందుతున్న వారందరూ భారీ మొత్తంలో బిల్లుల భారాన్ని మోయాల్సి ఉందని కూడా కథనాలు వెలువడుతున్నాయి. విద్యుత్ సవరణ బిల్లు-2020 ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతూ ఉండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ బిల్లు గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: