గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఇసుక రగడ ఎక్కువ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇసుక అమ్మకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష టీడీపీ నేతలు, జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఇసుక దోపిడి చేస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. అయితే ప్రతిపక్షం విమర్శలు చేస్తే వాటికి పెద్ద విలువ ఉంటుందా? అంటే చెప్పలేం. కానీ ఇదే విషయంపై అధికార పార్టీ నేతలే విమర్శలు చేస్తే పెద్ద విషయమే అవుతుంది.

 

ఇటీవల వైసీపీ ఎమ్మెల్యేలు వరుస పెట్టి ఇసుకలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు. కృష్ణా నది పక్కన ఉన్నా గుప్పెడు ఇసుక దొరకడం లేదని వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు మీడియా ముందుకొచ్చారు. అసలు ఇసుక రీచ్‌ల నుంచి స్టాక్ పాయింట్‌లకు అసలు చేరట్లేదని మరో పొన్నూరు వైసీపీ ఎమ్మెల్యే కీలారి రోశయ్య మాట్లాడారు. తాజాగా ఇసుకను అందరికి అందుబాటులో ఉంచడంలో ఏపీఎండీసీ విఫలం అయిందని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కామెంట్స్ చేశారు.

 

అయితే ఇలా సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చిన నేపథ్యంలో సీఎం జగన్..ఇసుక విషయంపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశంలో సీఎం జగన్ సీరియస్ అయ్యారని.. ఇసుక అక్రమాలకు పాల్పడితే ఎవరైనా సరే సహించేది లేదని అన్నట్లు తెలిసింది. అలాగే నియోజకవర్గానికి ఒకటే రేటు ఉండేలా చూడాలని, బల్క్ ఆర్డర్లకు జేసీ పర్మిషన్ తీసుకోవాలని, బుకింగ్‌ టైం మధ్యాహ్నం 12 గంటలనుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంచేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

అయితే ఇసుకలో ఎలాంటి అక్రమాలకు చోటు ఇవ్వకూడదని చెప్పి, జగన్ వెంటనే స్పందించి వాటికి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ గతంలో చంద్రబాబు దారి వేరేగా ఉండేది. ఇసుకలోనే టీడీపీ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్ని అక్రమాలు జరిగినా బాబు మాత్రం తగిన చర్యలు తీసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో అక్రమదారులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్‌తో కష్టమే అని అక్రమదారులు అనుకునేలా జగన్ ప్రభుత్వం ముందుకెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: