టీడీపీలో నికరంగా ఉన్న వారు ఇరవై మంది. గెలిచింది 23 మంది అయితే అందులో ముగ్గురు వేరేగా ఉంటున్నారు. వారే విజయవాడకు చెందిన వల్లభనేని వంశీ. గుంటూరు జిల్లాకు చెందిన మద్దాలి గిరి. ప్రకాశం జిల్లాకు చెందిన కరణం బలరాం. ఈ ముగ్గురూ వైసీపీ సర్కార్ తో మంచిగా ఉంటున్నారు.

 

అయితే ఇంతకు మూడింతలు మంది టీడీపీ నుంచి సైకిల్ దిగి వస్తారని వైసీపీ నేతలు అంటున్నారు. వారంతా రెడీగా ఉన్నారని, అయితే దగ్గరలో రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో వీరంతా  ఆగారని అంటున్నారు. టీడీపీ విప్ జారీ చేస్తుందని, ఆ విప్ ని ఉల్లఘిస్తే ఎమ్మెల్యే పదవి పోతుంది.

 

దాంతో తెలివిగానే తమ్ముళ్ళు ఉంటున్నారని అంటున్నారు. ఈ నెల 19న రాజ్యసభ ఎన్నికల్లో ఓటేసి ఆ తరువాత గోడ దూకే పని మొదలెడతారని అంటున్నారు. దాదాపు పది మంది వరకూ ఎమ్మెల్యేలు టీడీపీని వీడుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే సాగుతోంది.

 

ఆ విధంగా చూస్తే వీరంతా బయటకు వస్తే చంద్రబాబు ప్రతిపక్ష నేత పదవి పోతుందని అంటున్నారు. మరో గండం కూడా ఉంది. అదేంటంటే మొత్తం 23 మందిలో 13 మంది వేరు పడితే వారిని ప్రత్యేక గ్రూప్ గా స్పీకర్ గుర్తించడమే కాదు, వారికే సభలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేలా అవకాశాలు ఇస్తే ఇక చంద్రబాబు ఒట్టి ఎమ్మెల్యేగా మిగిలిపోతారని అంటున్నారు.

 

అదే కనుక జరిగితే ఇబ్బందేనని చెబుతున్నారు. మరి టీడీపీ అధినేత చంద్రబాబు తనదైన రాజకీయ చాణక్యంతో దీనికి విరుగుడుగా ఏం చేయబోతున్నారో చూడాలి. ఏది ఏమైనా టీడీపీలో కొత్త సంక్షోభం ముదిరి పాకాన పడే ముహూర్తం రెడీగా ఉందని రాజకీయ వర్గాలో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిణామాలు జరిగితే మాత్రం కరోనా మహమ్మారి కారణంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కడం ఖాయమని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: