విదేశాల నుంచి భార‌త‌దేశంలోనిపెద్ద‌పెద్ద న‌గ‌రాల‌కు విస్త‌రించిన క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ప‌ల్లెల్ల‌నూ చుట్టుముడుతోంది. లాక్‌డౌన్ స‌డ‌లింపుల‌తో ప‌ట్ట‌ణాల నుంచి సొంతూళ్ల‌కు వెళ్తున్న వ‌ల‌స కార్మికులు, కూలీల‌తో గ్రామాల‌కు వ్యాపిస్తోంది. కొద్దిరోజులుగా ప‌ల్లెల్లోనూ ఎక్కువ‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌డంపై తీవ్ర ఆందోళ‌న‌క‌ర‌మైన ప‌రిస్థితులు ఏర్ప‌డుతున్నాయి. వ‌ల‌స కార్మికులు ఎక్కువ‌గా బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, గుజరాత్‌, ఒడిశా, రాజస్థాన్‌ రాష్ర్టాల వారే కావ‌డం గ‌మ‌నార్హం. వీరు ల‌క్ష‌లాదిమంది ఉన్నారు. శ్రామిక్ రైళ్లు, బస్సుల్లో వీరిని ప్ర‌భుత్వాలు సొంతూళ్ల‌కు త‌ర‌లించాయి. వారు స్వస్థలాలకు చేరుకున్న తర్వాత నిర్వహిస్తున్నక‌రోనా నిర్ధార‌ణ‌ పరీక్షల్లో వందల కేసులు బయటపడుతున్నాయి.

 

ఆంధ్రప్రదేశ్‌లో గత మూడువారాల్లో 1500 కేసులు నమోదుకాగా, అందులో 500 కేసులు గ్రామాల్లోనే వెలుగులోకి వచ్చాయి. కేరళలో కూడా.. కాసరగోడ్‌ జిల్లాలో 112, పాలక్కడ్‌లో 144 కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన‌ప‌డుతున్న పల్లెలు ఉత్తర భారతంలోనే అధికంగా ఉన్నాయి. రాజస్థాన్‌లోని పాజిటివ్‌ కేసుల్లో 30శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. దుంగార్పూర్‌, జలోర్‌, జోధ్‌పూర్‌, నగౌర్‌, పాలి జిల్లాలు రెడ్‌జోన్లుగా మారాయి. ఒడిశాలో ప్రస్తుతం 80శాతం కరోనా కేసులు గ్రామాల్లోనే నమోదవుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లో మార్చిలో కేసులు కేవలం కోల్‌కతాలోనే నమోదయ్యాయి. ఇప్పుడు రాష్ట్ర రాజధానికి సుదూరంగా ఉన్న మాల్దా, ఉత్తర మిడ్నాపూర్‌, దక్షిణ మిడ్నాపూర్‌, హూగ్లీ, కూచ్‌బిహార్‌ జిల్లాల్లోనే ఎక్కువగా వైర‌స్‌ విస్తరిస్తున్నది. ఈ రాష్ర్టానికి ఇటీవల 6 లక్షలమంది వలస కూలీలు చేరుకోవటంతో వైరస్‌ గ్రామాల్లోకి పాకింది.

 

బీహార్‌లో జూన్‌ 2 నాటికి 4,049 కేసులు నమోదుకాగా, అందులో మే 3 తర్వాత రాష్ట్రానికి వ‌చ్చిన‌ కూలీలే 2,905 మంది ఉండ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో ప్రస్తు తం 70శాతం  కేసులు వలస కూలీలవే. వారంతా గ్రామీణ ప్ర‌జ‌లే. బీహార్‌కు ఇటీవల శ్రామిక్‌ రైళ్లలో 20లక్షల మంది కార్మికులు చేరుకున్నారు. మరో 2లక్షల మంది రోడ్డు మార్గంలో వచ్చారు. వీరిలో ఇంకెంతమందికి వ్యాధి సోకిందోనని ఆందోళన చెందుతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మే 1న గ్రామాల్లో కేసులు 8 ఉండగా, జూన్‌ ప్రారంభం నాటికి 464కు చేరుకుంటే.. ఇప్పుడు 90శాతం కేసులు గ్రామాల్లోనే ఉన్నాయి. లాక్‌డౌన్‌ సడలించాక ఉత్తరప్రదేశ్‌కు 30లక్షల మంది కార్మికులు చేరుకున్నారు. రాష్ట్రంలోని మొత్తం 3,324 యాక్టివ్‌ కేసుల్లో 70శాతం గ్రామాల్లోనే ఉన్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: