దేశంలో కరోనా విజృంభణ వల్ల దేశవ్యాప్తంగా ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలు మూతబడిన సంగతి తెలిసిందే. ఐదో విడత లాక్ డౌన్ లో వీటికి సడలింపులు విధించటంతో టీటీడీ ఈ నెల 11 నుంచి భక్తులకు సర్వ దర్శనం కల్పించనుంది. శ్రీవారి దర్శనానికి గైడ్ లైన్స్ నిన్న విడుదలయ్యాయి. మొదట ట్రయల్ రన్ లో ఉద్యోగులకు, స్థానికులకు 8, 9, 10 తేదీలలో టీటీడీ అనుమతులు ఇవ్వనుంది. రోజుకు 7000 మందికి దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. 
 
ఈ నెల్ 8 నుంచి భక్తులకు ఆన్ లైన్ లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఆన్ లైన్ లో రోజుకు 3,000 టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. ఆన్ లైన్ ద్వారా దర్శనం టికెట్లు కొనుగోలు చేసేవారికి టీటీడీ గదులను కూడా కేటాయించనుంది. ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవటం తెలియని వారు గ్రామ సచివాలయాల ద్వారా తిరుమల శ్రీవారి దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 
 
గ్రామ సచివాలయాలకు వెళ్లి వివరాలను నమోదు చేసి డాక్యుమెంట్లను అందజేయాల్సి ఉంటుంది. టికెట్లు అందుబాటులో ఉంటే వెంటనే సచివాలయ ఉద్యోగులు దర్శనానికి టికెట్లను బుక్ చేస్తారు. దర్శనానికి వెళ్లే భక్తులు మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అని టీటీడీ స్పష్టం చేసింది. టీటీడీ తిరుమలకు వచ్చే భక్తుల్లో రోజుకు 200 మందికి ర్యాండమ్ గా పరీక్షలు నిర్వహించనుంది. 
 
ఉదయం 6.30 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు మాత్రమే టీటీడీ భక్తులను అనుమతించనుంది. 10 ఏళ్ల లోపు చిన్నారులకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు అనుమతి లేదని టీటీడీ స్పష్టం చేసింది. కేవలం గంట మాత్రమే వీఐపీ దర్శనానికి అనుమతులు ఇస్తామని... శ్రీవారి మెట్టుమార్గాన్ని ఇంకొన్ని రోజులు అనుమతించబోమని అధికారులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా రాత్రివేళల్లో కర్ఫ్యూ ఉండటంతో 7.30 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇవ్వాలని టీటీడీ చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: