ఇప్పటికే నైరుతి పవనాలు కేరళలో ప్రవేశించాయి. మరో రెండు మూడు రోజుల్లో ఏపీలో నైరుతి రుతు పవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వాతావరణ ప్రభావం వల్ల పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. నైరుతి రుతుపవనాల ఆగమనానికి సంకేతంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
రాగల 48 గంటల్లో నైరుతి పవనాలు మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, పుదుచ్చేరి, కరైకల్, తూర్పు మధ్య బంగాళఖాతంలో విస్తరించనున్నాయని తెలుస్తోంది. నైరుతి ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గడచిన 24 గంటల్లో అనకాపల్లి, యానాంలో 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. 
 
ఈ నెల 8వ తేదీ నాటికి అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వాతవరణ నిపుణులు ఒకరు ఈ నెల 9వ తేదీన కోస్తా, రాయలసీమలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని అంచనా వేశారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగు పడి ఉపాధి కూలీలు మృతి చెందుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. 
 
విశాఖ జిల్లా సబ్బవరం మండలం మొగలిపురంలో నిన్న పిడుగు పడి పాధి కూలీ బైలపూడి చెల్లమ్మ(59) అక్కడికక్కడే మృతి చెందింది. సింగంపల్లి చెల్లమ్మ(40), శిరపురపు రమణమ్మ (40) ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. మరో మూడు రోజుల్లో నైరుతి ఆగమనం అంటూ వస్తున్న వార్తలు రైతుల కళ్లల్లో ఆనందం నింపుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: