దేశంలోని ముగ్గురు వీవీఐపీలు... రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ కోసం అత్యాధునిక విమానాలు రెడీ అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌కు ధీటుగా భద్రత కల్పించేలా వీటిని రూపొందించారు.  దీంతో ఈ విమానాల్లో ఉపయోగించే అత్యాధునిక సాంకేతికపై ఆసక్తి నెలకొంది. 

 

అమెరికా అధ్యక్షుడు ఇతర దేశాలకు వెళ్లిన ప్రతిసారి మేఘాలను చీల్చుకుంటూ దూసుకొచ్చే ఎయిర్ ఫోర్స్ వన్ విమానం గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతుంది. ఇందులోనే ఓ వోవల్ ఆఫీసు, కాన్ఫరెన్స్ రూమ్, మంత్రుల బృందానికి సరిపడా ఏర్పాట్లు ఉండడంతో... ఈ విమానాన్ని కదిలి వచ్చే శ్వేతసౌధంగా అభివర్ణిస్తారు. ఈ విమానంలో అణుదాడిని సైతం తట్టుకోగల సామర్థ్యం ఉంది. యుద్ధంలో ఉపయోగకరంగా ఉండడంతో పాటు, అధ్యక్షుడి సురక్షిత ప్రయాణానికి ఉద్ధేశించినది కాబట్టి ఇందులో భద్రతా పరమైన పలు విలక్షణ సదుపాయాలు కూడా ఉన్నాయి. శత్రు రాడార్లను గుర్తించి వాటిని స్తంభింప చేయడంలో ఇది దిట్ట. క్షిపణులను ప్రయోగించే విధంగా వాటిపై అగ్ని జ్వాలలను సైతం విడుదల చేయగలదు. మిర్రర్ బాల్ డిఫెన్స్ టెక్నాలజీతో శత్రు రాడార్లను తుత్తునియలు చేస్తుంది. 

 

ఎయిర్‌ఫోర్స్ వన్‌లో 630 నుంచి 700 మైళ్ల వేగంతో ప్రయాణించగల నాలుగు సీఎఫ్6-80సీ2బీ1 జెట్ ఇంజన్లు ఉన్నాయి. విమానంలో నుంచే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, వీడియో కాన్ఫరెన్సింగ్, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే సదుపాయం.. ఇలా ఎన్నో సమాచార ప్రత్యేకతలు ఎయిర్ ఫోర్స్ వన్‌లో ఉన్నాయి. గాల్లోనే ఇంధనం నింపుకునే అవకాశం ఉండడంతో అధ్యక్షుడు యుద్ధ సమయంలో అవసరమైతే కొన్ని రోజుల పాటు గాల్లో నుంచే కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉంది. మిలటరీ ఏజెంట్లు సైతం ఇందులోని ఫీచర్లను అర్థం చేసుకోవడం కష్టతరం కావడం వల్ల దీనికి మిలటరీయేతర అరివీర భయంకర యుద్ధ విమానంగా పేరొచ్చింది. 

 

దాదాపు పాతికేళ్ల తర్వాత మళ్లీ భారత దేశాధినేతలు ప్రయాణించేందుకు శత్రు దుర్బేధ్యమైన మూడు విమానాలు దేశానికి సమకూరనున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తున్న బోయింగ్ 777-300 ఈఆర్ విమానాల్లో.. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్ ఫోర్స్ వన్‌కు దీటుగా విలక్షణ రక్షణ సదుపాయాలు ఉన్నాయి. మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ తో పాటు శక్తిమంతమైన ఈడబ్ల్యూ జామర్‌, మిర్రర్‌ బాల్‌ ఈక్వలెంట్‌ సిస్టం, క్షిపణి హెచ్చరిక వ్యవస్థ వంటివి ఉన్నాయి. ఇందులో అత్యాధునిక రక్షణ వ్యవస్థలను పొందుపర్చిన కారణంగా ఇకపై భారత వైమానిక దళానికి చెందిన నిపుణులతో పైలట్లకు శిక్షణ ఇవ్వనున్నారు. సాధారణంగా ఎయిరిండియా పైలెట్లే ఎయిరిండియా వన్ విమానాలను నడిపిస్తారు.

 

అమెరికా డల్లాస్‌లో బోయింగ్ తయారీ కేంద్రాల్లో తయారైన ఈ విమానాలకు ఆధునిక సైనిక రక్షణ వ్యవస్థలు, ప్రత్యేకంగా క్యాబిన్‌లో మార్పులు చేసి పునర్నిర్మించారు. ఇందులో గంటకు 900 కిలోమీటర్లు ప్రయాణించగల రెండు జీఈ90-115 ఇంజిన్లు ఉంటాయి. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాని భద్రత కోసం భారత్ ఈ విమానాల్లో దేశీయ మిలటరీ రక్షణ వ్యవస్థలను పొందుపర్చుతోంది. ఇందులో అతిపెద్ద వైమానిక పరారుణ నిరోధక ప్రమాణాలు , స్వీయ- రక్షణ సూట్లు కీలకమైనవి. ప్రయాణంలో ఉండగా దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగితే ఈ వ్యవస్థలు విమానాన్ని కాపాడగలవు. ఈ విమానాల విలువ 190 మిలియన్ డాలర్లు.  ఈ విమానాల్లో అత్యాధునిక ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్లు కూడా ఉన్నాయి. దీంతో ఏదైనా దాడులు జరిగినప్పుడు వెనుదిరగకుండా.. ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టగలదు. అమెరికా అధ్యక్షుడు ఉపయోగిస్తున్న ఎయిర్‌ఫోర్స్ వన్ తరహాలో ఎయిరిండియా వన్ 777ను రూపొందించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: