ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 210 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని సచివాలయంలో వైరస్ వేగంగా విజృంభిస్తోంది. తాజాగా ఈరోజు సచివాలయంలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. సీఎం పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. 
 
దీంతో ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈరోజు నమోదైన కేసుల్లో ఔట్ సోర్సింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఒక ఉద్యోగికి, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగికి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు, విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్దారణ అయింది. 
 
సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటం ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తోంది. సచివాలయంలోని ఉద్యోగుల్లో 750 మందికి పరీక్షలు చేయగా ఐదుగురు కరోనా భారీన పడినట్టు తేలింది. తాజాగా ఐదుగురు కరోనా భారీన పడటంతో సచివాలయంలోని 1, 2వ బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు. బ్లాక్‌ 3, అసెంబ్లీలో పనిచేసే ఉద్యోగుల శాంపిళ్లను కూడా పరీక్షల కోసం తీసుకున్నారని సమాచారం అందుతోంది. 
 
సచివాలయంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండటంతో సచివాలయ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను విధించింది. ఉద్యోగులు తప్పనిసరిగా ఆరోగ్య సేతు యాప్‌ని డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకోవాలని సీఎస్ నీలం సాహ్ని నుంచి ఉత్తర్వులు విడుదలయ్యాయి. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3,588కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2323 మంది కోలుకోగా 73 మంది మృతి చెందారు.               

మరింత సమాచారం తెలుసుకోండి: