కరోనా కారణంగా యువతకు పెద్ద ఇబ్బందేమీ ఉండదని ఇప్పటిదాకా డాక్టర్లు చెబుతూ వచ్చారు. కానీ లేటెస్ట్ గా చేసిన పరిశోధనలో యూత్ కు బ్రెయిన్ స్ట్రోక్ ముప్పుందని తేలింది. కరోనా లక్షణాలు లేనివాళ్లకి కూడా ఈ స్ట్రోక్ వస్తుందని తేలడం.. మరింత ఆందోళన కలిగిస్తోంది. 

 

ఆరోగ్యంగా ఉన్న యువతకు కొవిడ్‌ లక్షణాలు కనిపించకపోయినా.. బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ వచ్చే ముప్పు అధికంగా ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మార్చి 20-ఏప్రిల్‌ 10 మధ్య తాము చేసిన పరిశోధనతో ఈ విషయం గమనించామని థామస్‌ జెఫర్సన్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు చెబుతున్నారు. తాము చూసిన స్ట్రోక్స్‌ ఎప్పటిలా సాధారణంగా లేవని న్యూరో సర్జరీ జర్నల్‌లో ప్రచురించారు.

 

30, 40, 50 ఏళ్ల వయసు కరోనా బాధితుల్లో భారీ స్ట్రోక్స్‌ గమనించామంటున్నారు సైంటిస్టులు. సాధారణంగా ఇలాంటి స్ట్రోక్స్ 70, 80 ఏళ్ల వయసుల్లో వస్తుంటాయని అంటున్నారు. కరోనా సోకిన 14 మందిలో స్ట్రోక్స్‌ లక్షణాలను పరిశీలిస్తే.. ఫలితాలు ఆందోళనకరంగా ఉన్నాయని, శాంపిల్ సైజ్ చిన్నదే అయినా.. రిజల్ట్స్ దారుణంగా ఉన్నాయని చెప్పారు. 

 

తమలో కరోనా వైరస్‌ ఉన్నట్టు తెలియని యువతలో రక్తం చాలాచోట్ల గడ్డగట్టి భారీ స్ట్రోక్స్‌కు కారణమవుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు. 14 మంది కోవిడ్ బాధితుల్ని పరీక్షిస్తే.. అందులో ఎనిమిది మంది పురుషులు, ఆరుగురు స్త్రీలు ఉన్నారు. వీరంతా స్ట్రోక్స్‌ లక్షణాలు కనిపించడంతో తమ వద్దకు వచ్చారని వివరించారు. అందులో సగం మందికి తమలో వైరస్‌ ఉన్నట్టు తెలియదని చెప్పారు. మిగతావారిలో లక్షణాలు కనిపించడంతో చికిత్స చేయించుకున్నారని పేర్కొన్నారు.

 

మానవ కణాల్లోని ఏస్‌2 ప్రొటీన్‌ను అంటుకొని కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశిస్తోంది. కరోనా వైరస్‌ ఏస్‌2 రిసెప్టార్‌ సాధారణ విధులను కూడా అడ్డుకుంటుందేమోనని పరిశోధకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మెదడుకు రక్త సరఫరాను నియంత్రించేది ఎస్2 రిసెఫ్టారే. వైరస్‌ వల్ల రక్తనాళాల్లో మంట పెరిగి ఆ నాళాల గోడలు దెబ్బతింటున్నాయని భావిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: